కాంగ్రెస్ కంటే బీజేపీకి 8 రెట్లు ఆస్తులెక్కువ! టీఆర్ఎస్ రెండో సంపన్న పార్టీ, టీడీపీకి అప్పులెక్కువ!
న్యూఢిల్లీ: దేశంలో సంపన్న రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కొనసాగుతోంది. మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటింది. వరుసగా రెండుసార్లు అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ.. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా బీజేపీ అత్యధిక ఆస్తులు కలిగిన పార్టీగా రికార్డుల్లోకెక్కింది.

సంపన్న పార్టీ బీజేపీ: కాంగ్రెస్ కంటే 8 రెట్లు ఆస్తులు
2019-2020 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ. 4,847.78 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే కమలం పార్టీ ఆస్తుల విలువ ఏకంగా 8 రెట్లకు పైనే ఉంది. 201-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తులను, అప్పులను అధ్యయనం చేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫామ్స్(ఏడీఆర్) ఓ నివేదిక రూపొందించింది.

జాతీయ పార్టీల్లో బీజేపీకే అత్యధిక ఆస్తులు
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల విలువ మొత్తం రూ. 6,988.57 కోట్లుగా ఉంది. ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తులు రూ. 2129.38 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఒక్క బీజేపీనే రూ. 4847.78 కోట్ల ఆస్తులను ప్రకటించింది. ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో దాదాపు 70 శాతం ఒక్క బీజేపీదే కావడం గమనార్హం. ఆ తర్వాత రూ. 698.33 కోట్ల ఆస్తులతో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి రూ. 588.16 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

రెండో సంపన్న ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్
ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో 95.27 శాతం అంటే రూ. 2028.71 కోట్లు 10 ప్రాంతీయ పార్టీలవే అని నివేదిక వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లో రూ. 563.47 కోట్ల ఆస్తులతో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత రూ. 301.47 కోట్ల ఆస్తులతో రెండోస్థానంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిలిచింది. అన్నాడీఎంకే రూ. 261.61 కోట్ల ఆస్తులను ప్రకటించింది. పార్టీల ఆస్తుల్లో ఎక్కువ భాగం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలోనే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

తెలుగుదేశం పార్టీకి అప్పులెక్కువ
ఇక అప్పుల విషయానికొస్తే.. 7 జాతీయ, 44 ప్రాంతీయ పార్టీల మొత్తం అప్పులు రూ. 134.93 కోట్లుగా ఉన్నాయి. ఇందులో 74.27 కోట్లు జాతీయ పార్టీల అప్పులు కాగా, ఒక్క కాంగ్రెస్ పార్టీనే రూ. 49.55 కోట్ల రుణాలు బాకీ పడినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ. 11.32 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు పేర్కొంది. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే.. అత్యధికంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి రూ. 30.34 కోట్లు, డీఎంకేకు రూ. 8.05 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.