53ఏళ్ల వయసులో.. కూతుళ్ళతో కలిసి బోర్డు పరీక్షలు పాసైన తల్లి!!
త్రిపుర: చాలా మంది చదువుకోవాలని ఉన్నా చదువుకోలేక పోతున్నామని తెగ బాధ పడుతూ ఉంటారు. పట్టుదల ఉండాలే కానీ ఏ వయసులో అయినా చదువును కొనసాగించవచ్చు అని అనేక మంది చాలా సందర్భాలలో నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 53 ఏళ్ల తల్లి నేర్చుకోడానికి వయసుతో సంబంధం లేదని, చదువుకోవటం ఏ వయసులోనైనా చేయవచ్చని నిరూపించింది . త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలో షిలా రాణి దాస్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కూతుళ్ళ ప్రోత్సాహంతో 10వ తరగతి పరీక్షల్లో పాసైన తల్లి
షిలా రాణి దాస్ కు చిన్న వయస్సులో వివాహం జరగడంతో ఆమె తన పదో తరగతి పరీక్షలకు హాజరు కాలేకపోయింది. ఆమె కుమార్తెలు రాజశ్రీ దాస్ మరియు జయశ్రీ దాస్ ఇప్పుడు తల్లిని 53 ఏళ్ల వయసులో చదువుకోవాలని ప్రోత్సహించారు. పదవతరగతి పరీక్షలు రాయాలని పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహంతో తల్లి ఫైనల్ గా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది.

10వ తరగతి కూడా చదవలేకపోయానన్న తన కలను నేరవేర్చుకున్న తల్లి
ఇది నిజంగా నాకు గర్వకారణమైన క్షణం. నేను నా చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేనప్పటికీ, నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలిగాను. ఇది నాకు గొప్ప విజయం అని దాస్ అన్నారు. అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న దాస్, కొన్నేళ్ల క్రితం తన భర్తను కోల్పోయిన తర్వాత ఆమె తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. కనీసం పదో తరగతి కూడా చదువుకోలేక పోయానని బాధపడుతున్న ఆమె కల నెరవేర్చుకోవడం కోసం పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది. అందుకు పిల్లలు సహకారం అందించడంతో బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణురాలు అయింది.

మాతో పాటు అమ్మ కూడా పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది.. అందరం పాసయ్యాం అంటున్న కూతుళ్ళు
ఇది మా కాళి దేవత యొక్క ఆశీర్వాదం అంటున్నారు పిల్లలు. మా అమ్మ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంది. కానీ ఆమె పనిలో బిజీగా ఉండటం మరియు మమ్మల్ని చూసుకోవడం వల్ల పెద్దగా ఆమెకు చదువుకోడానికి అవకాశం దొరకలేదు. అయితే, మేము హయ్యర్ సెకండరీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఆమెను పరీక్షకు హాజరుకావాలని ప్రోత్సహించాము. అందుకు అంగీకరించి పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచింది అని కుమార్తె జయశ్రీ తెలిపారు.

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన మహిళ
త్రిపుర త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూలై 6న రెండు పరీక్షల ఫలితాలను ప్రకటించగా, పదో తరగతి పరీక్షకు హాజరైన 43,294 మంది విద్యార్థుల్లో 37,748 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 86.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. హయ్యర్ సెకండరీ పరీక్షలో 28,931 మంది విద్యార్థులు హాజరుకాగా 27,544 మంది ఉత్తీర్ణులై 94.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ పరీక్షలలో తల్లి పదవ తరగతిలో, ఇద్దరు కూతుళ్లు 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి తల్లి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం, చదువుకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications