Lawyers: లాయర్లపై దాడి చేస్తే ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానాలు- అసెంబ్లీలో బిల్లు ఆమోదం..!
ఒకప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకున్న న్యాయవాదులకు (Lawyers) ఇప్పుడు దాడులు స్వాగతం పలుకుతున్నాయి. వారు వాదిస్తున్న కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వారు, విచారణలను తప్పుదోవ పట్టించేలా లాయర్లపై ఒత్తిళ్లు తీసుకోవడం, కుదరకపోతే దాడులకు దిగడం చూస్తూనే ఉన్నాం. వీటిని అరికట్టేందుకు కఠిన చట్టాల అవసరం ఉందని న్యాయస్థానాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాయర్లపై దాడులకు దిగితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా గోవా ప్రభుత్వం అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టింది.
విధి నిర్వహణలో ఉన్న లాయర్లపై దాడి చేసిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాతో సహా కఠినమైన శిక్షలను నిర్దేశించే బిల్లుకు ఇవాళ గోవా అసెంబ్లీ ఆమోదించింది. గోవా న్యాయవాదుల రక్షణ బిల్లు 2026పేరుతో తెచ్చిన ఈ బిల్లులో బెదిరింపులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు పోలీసు రక్షణ కల్పించడం, దుర్వినియోగానికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు కూడా ఉన్నాయి. లాయర్లపై తప్పుడు లేదా దురుద్దేశపూర్వక ఫిర్యాదులు చేసిన వారికి ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఈ బిల్లు చెబుతోంది.

న్యాయ, చట్ట, న్యాయవ్యవస్థ శాఖను కూడా నిర్వహిస్తున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది.లాయర్లు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు వారిపై హింస, బెదిరింపులు, వేధింపులు, తప్పుడు ఆరోపణలు, ఆస్తి నష్టం వంటి ఘటనలు పెరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు న్యాయవాద వృత్తి యొక్క స్వాతంత్రాన్ని, నిర్భయ పనితీరును ప్రభావితం చేస్తాయని, కక్షిదారుల న్యాయ ప్రాతినిధ్య హక్కును, న్యాయం పొందే అవకాశాన్ని దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. ఈ చట్టం ప్రకారం న్యాయవాదిపై దాడి చేసినా లేదా నేరపూరిత బలప్రయోగం చేసినా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.55 వేల వరకు జరిమానా విధిస్తారు. స్వచ్ఛందంగా తీవ్రమైన గాయం చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు.














Click it and Unblock the Notifications