రాములవారి భజనలో మోదీ
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో 11 రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచే పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
గడువు సమీపించిన నేపథ్యంలో- ప్రధాని మోదీ తెర మీదికి వచ్చారు. 11 రోజుల ప్రాణ ప్రతిష్ఠోత్సవాలను మహారాష్ట్ర నాసిక్‌లో ప్రారంభించారు. ఈ ఉదయం ఆయన నాసిక్‌ను సందర్శించారు. అక్కడి కాలా రామ్ మందిరంలో ఏర్పాటు చేసిన రాములవారి భజనలో పాల్గొన్నారు. కీర్తనలను ఆలపించారు. సుమారు గంట పాటు ఆలయంలో గడిపారాయన. అనంతరం పంచవటీ ఆశ్రమాన్ని సందర్శించారు.

అంతకంటే ముందు నాసిక్‌లో భారీ రోడ్ షోను నిర్వహించారు మోదీ. స్థానిక మిర్చీ చౌక్ నుంచి సంత్ జనార్ధన్ స్వామి మహారాజ్ చౌక్ వరకూ సుమారు 40 నిమిషాల పాటు సాగింది ఈ రోడ్ షో. భారతీయ జనతా పార్టీ జెండాలను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం రామ్ కుండ్‌కు చేరుకున్నారు. నాసిక్ పురోహిత్ సంఘ్ అధ్యక్షుడు సతీష్ శుక్లా ఆయనకు పగ్డీని ధరింపజేశారు. రామ్ కుండ్ వద్ద గోదావరికి పూజలు చేశారు. హారతి పట్టారు.

ఈ సందర్భంగా మోదీ- అఖిల భారతీయ స్వామి సమర్థ్ గురుకుల్ పీఠం చీఫ్ అన్నాసాహెబ్ మోరె, కైలాస మఠాధిపతి స్వామి సంవిదానంద సరస్వతి, బీజేపీ సీనియర్ నేత తుషార్ భోంస్లేను కలిశారు. అనంతరం కాలా రామ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి భజన చేశారు.












Click it and Unblock the Notifications