Ayodhya: అయోధ్య ప్రాణప్రతిష్ట రోజు ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో భవ్య రామాలయం ప్రాణప్రతిష్టకు సిద్ధమవుతోంది. ఈ మహాఘట్టం కోసం దేశవ్యాప్తంగా జనం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో ఇప్పటికే ప్రాణప్రతిష్టకు సంబంధించి చేపట్టాల్సిన క్రతువులు మొదలయ్యాయి. ఇవి జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్టతో ముగియబోతున్నాయి. ఈ మహాఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉత్తర్ ప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలు ఆరోజు సెలవు దినంగా ప్రకటించాయి. వీటికి అదనంగా ఇప్పుడు కేంద్రం కూడా కీలక ప్రకటన చేసింది.

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాలకు ప్రాణప్రతిష్ట జరిగే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే నేరుగా వీక్షించాలనుకునే వారు అయోధ్యకు కూడా వెళ్తున్నారు. ఇలా ప్రతీ ఒక్కరూ ఈ మహా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో కేంద్రం కూడా తమ ఉద్యోగులకు జనవరి 22న సగం రోజు సెలవు ప్రకటించింది. ఈ మేరకు అన్ని శాఖలకు మెమో ఇచ్చింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా జనవరి 22న ఈ సగం రోజు సెలవు ఇస్తోంది. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలలో పాల్గొనాలన్న ఉద్యోగుల సెంటిమెంట్ ను గౌరవిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు మధ్యాహ్నం 02:30 గంటల వరకు సగం రోజులు మూసివేస్తారు.
మరోవైపు జాతీయ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ అయోధ్యలో జరిగే మొత్తం ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు పలు ప్రైవేటు ఛానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం అందించబోతున్నాయి. భారత్ తో పాటు విదేశాలలో బహిరంగ ప్రదేశాలలో పెద్ద స్క్రీన్‌లపై అయోధ్య వేడుకను ప్రత్యక్షంగా ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications