అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్తాం: ఎంపీలో అమిత్ షా కీలక హామీ
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక హామీలను ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ ప్రజలను ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య దర్శనానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య ఆఫర్ ప్రకటించారు అమిత్ షా (Amit Shah).
వెంటనే అక్కడున్న ఓ సీనియర్ బీజేపీ నేత స్పందిస్తూ.. అయోధ్య మందిర దర్శనం కోసం తాము డబ్బులు ఖర్చు చేయాలా? అని ప్రశ్నించారు. దీనికి అమిత్ షా బదులిస్తూ.. 'మీరు ఎలాంటి ఖర్చూ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామమందిర దర్శనం కల్పిస్తాం. దశలవారీగా మిమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్తాం. మా ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని ప్రకటించాం' అని అమిత్ షా వెల్లడించారు.

తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదే పదే అడిగేవారు.. ఆయనకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా.. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో తమ కుమారులను సీఎం చేయాలని ప్లాన్లు వేస్తున్నారు. ఇక, సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలని చూస్తున్నారు. తమ కొడుకులు, కుమార్తెల కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఎలా సేవ చేస్తారు? అని అమిత్ షా నిలదీశారు.
కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గత వారం మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 450కే గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య వంటి వరాలు కురిపించింది. నవంబర్ 15తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి.












Click it and Unblock the Notifications