• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్ కపూర్, కార్గిల్ ప్రభు, ఎమర్జెన్సీ యాదవ్... ఎవరు వీరంతా? వీరి పేర్ల వెనుక చరిత్ర ఏమిటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆజాద్ కపూర్, ఎమర్జెన్సీ యాదవ్, లాక్‌డౌన్ కక్కండి

సాధారణంగా భారతీయులు తమ పిల్లలకు దేవుడి పేర్లు ఎక్కువగా పెడుతుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు స్వాతంత్ర్య సమర యోధుల పేర్లనూ విరివిగా పెట్టేవారు. తమకు ఇష్టమైన సినిమా స్టార్లు లేదా క్రీడాకారుల పేర్లు, లేదంటే ఫేమస్ కార్టూన్ పేర్లు పెట్టడం కూడా అడపాదడపా కనిపిస్తుంటుంది.

కొందరు మాత్రం చాలా వైవిధ్యమైన, ప్రత్యేకమైన పేర్లను ఏరికోరి పెట్టుకుంటారు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇలాంటి ప్రత్యేకమైన పేర్లు పెట్టుకున్న ఆరుగురిని బీబీసీ కలిసింది. ఈ పేర్లు భలే చిత్రమైనవి. ఎక్కడా కనీవినీ ఎరుగని పేర్లు. వాళ్లు పుట్టినప్పుడు జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా వాళ్ల తల్లిదండ్రులు వారికి ఇలాంటి పేర్లు పెట్టారు.

అవేమిటో చూద్దాం.

ఆజాద్ కపూర్

జాద్ కపూర్, 75 ఏళ్లు

ఆజాద్ కపూర్ 1947 ఆగస్ట్ 15న పుట్టారు. భారతదేశానికి స్వతంత్రం లభించిన రోజే ఆమె పుట్టడంతో ఆమెకు ఆజాద్ కపూర్ అని పేరు పెట్టారు.

"నేను పుట్టినప్పుడు మా కుటుంబం సంబరాలు చేసుకుంది. భారత మాత ఇంటికి వచ్చింది, స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది అంటూ వేడుక చేసుకున్నారు" అని ఆజాద్ కపూర్ చెప్పారు.

అజాద్ అంటే స్వతంత్రం. అయితే, చిన్నప్పుడు ఆజాద్‌కు ఈ పేరు నచ్చేది కాదు. అబ్బాయిల పేరులా ఉందని అయిష్టత చూపేవారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆమె అలవాటుపడ్డారు.

"నా పుట్టినరోజును ఎవరూ మర్చిపోలేరు. నేను తెలిసినవాళ్లంతా ఆగస్టు 15న నా పుట్టినరోజును గుర్తుతెచ్చుకుంటారు. దేశం మొత్తం నా పుట్టినరోజును జరుపుకొంటుందని నా స్నేహితులు హాస్యమాడుతుంటారు" అని ఆజాద్ చెప్పారు.

ఎమర్జెన్సీ యాదవ్

ఎమర్జెన్సీ యాదవ్, 47 ఏళ్లు

ఎమర్జెన్సీ యాదవ్, 1975లో భారతదేశంలో ఎమెర్జెన్సీ ప్రకటించిన మర్నాడు అంటే జూన్ 26న పుట్టారు.

"భారతదేశ చరిత్రలో ఈ విషాదకరమైన, చీకటి కాలాన్ని ప్రజలు మరచిపోకూడదని నాకు ఈ పేరు పెట్టినట్టు మా నాన్న చెప్పారు" అని యాదవ్ అన్నారు.

1975 జూన్ 25న దేశంలో ఎమెర్జెన్సీ విధిస్తున్నట్టు అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రేడియోలో ప్రకటించారు. "అంతర్గత కల్లోలాల" కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

ఆ సమయంలో రాజ్యాంగ హక్కులను రద్దు చేశారు. పత్రికా స్వేచ్ఛను నియంత్రించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎందరో జైలు పాలయ్యారు.

ఎమర్జెన్సీ యాదవ్ తండ్రి రాం తేజ్ యాదవ్ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండేవారు. కొడుకు పుట్టడానికి కొన్ని గంటల ముందు రాం తేజ్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఆయన 22 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తరువాతే ఆయన కొడుకుని చూశారు.

"ఏ దేశంలోనైనా ఎమెర్జెన్సీ వచ్చిందంటే, ఆ దేశం వెనక్కి నడుస్తున్నట్టే లెక్క. మళ్లీ మన దేశానికి అలాంటి గతి పట్టకూడదని కోరుకుంటున్నా" అని ఎమెర్జెన్సీ యాదవ్ అన్నారు.

కార్గిల్ ప్రభు

కార్గిల్ ప్రభు, 23 ఏళ్లు

1999లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ప్రభు పుట్టారు. కార్గిల్ ప్రభుకు తన పేరు వెనకున్న కథేమిటో చాలాకాలం వరకూ తెలియలేదు.

"కార్గిల్ అని నాకు పేరు పెట్టినప్పటికీ, చిన్నప్పుడు దాని గురించి నాకు పెద్దగా తెలీదు. పెద్దయ్యాక గూగుల్ చేసి ఆ యుద్ధం గురించి తెలుసుకున్నా. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. ఆయన నాకు ఆ పేరు ఎందుకు పెట్టారో చెప్పే అవకాశం దొరకలేదు" అని కార్గిల్ ప్రభు చెప్పారు.

కార్గిల్ ప్రభు చెన్నైలో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. తన పేరులో ఉన్న జిల్లాకు ఆయన ఎప్పుడూ వెళ్లలేదు. కానీ, తాను సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో రాసుకున్నారు.

కార్గిల్ యుద్ధంలో 500 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం, కశ్మీర్ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి దేశంలోకి రావడంతో భారత్ ప్రతిఘటించింది. అయితే, అలాంటిదేమీ జరగలేదని పాకిస్తాన్ చాలాకాలం ఖండించింది. మూడు నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది.

"యుద్ధంపై నాకు నమ్మకం లేదు. కానీ, కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది సరైన నిర్ణయమేనని భావిస్తున్నాను" అని ప్రభు అన్నారు.

సునామీ రాయ్

సునామీ రాయ్, 17 ఏళ్లు

సునామీ రాయ్ పుట్టిన రోజును గుర్తుతెచ్చుకోగానే ఆ కుర్రాడి తల్లి కళ్లు చెమర్చాయి.

2004లో సునామీ భీభత్సం సృష్టించినప్పుడు, అండమాన్ దీవుల్లోని ఒక చిన్న కొండపై మౌనిత రాయ్ ఆశ్రయం పొందారు. అప్పటికి ఆమె 9 నెలల నిండు గర్భిణి.

"నా పెద్ద కొడుకుని తీసుకుని అక్కడి నుంచి పారిపోమని నా భర్తకు చెప్పాను. నేను, నా కడుపులో బిడ్డ బతికి బయటపడతామనుకోలేదు. రాత్రి 11.00 అవుతుండగా నాకు ప్రసవం అయింది. ఎలాంటి మనిషి సహాయం, మందులు లేకుండా చీకటిలో ఒంటరిగా ఒక పెద్ద రాయి పైన నా కొడుకుకి జన్మనిచ్చాను. నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. మళ్లీ నేను కోలుకోలేదు" అని మౌనిత చెప్పారు.

స్కూల్లో సునామీ రాయ్‌ని బాగా ఏడిపించేవారు. అంత పెద్ద విపత్తు పేరు పెట్టుకున్నాడని గేలి చేసేవారు. కానీ, మౌనితకు ఆ పేరు ఆశలకు, మనుగడకు గుర్తు.

"సునామీ వచ్చి ఎందరినో పొట్టనపెట్టుకుంది. ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయి రోదిస్తున్న సమయంలో, మా అబ్బాయి మా ఇంట్లో ఆశాకిరణాలు వెలిగించాడు. వాడు పుట్టడమే ఆరోజు జరిగిన మంచి" అని మౌనిత అన్నారు.

హిందూ మహాసముద్రంలో నీటి అడుగున భూకంపం కారణంగా 2004 డిసెంబర్ 26న సునామీ వచ్చింది. ఈ విధ్వంసంలో రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో సుమారు పదివేల మంది భారతీయులు కూడా ఉన్నారు.

ఖజాంచి నాథ్

ఖజాంచి నాథ్, 5 ఏళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్‌లో పుట్టాడు ఖజాంచి. అప్పటికి కొన్ని వారాల ముందే ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు.

నోట్ల రద్దు సమయంలో జనం బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు క్యూలు కట్టిన సంగతి తెలిసిందే. ఖజాంచి తల్లి సర్వేషా దేవి కూడా బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడానికి వెళ్లారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. లైనులో నిలబడినప్పుడు ఆమెకు నొప్పులు వచ్చాయి. ఖజాంచి అక్కడే పుట్టాడు.

"పిల్లాడు బ్యాంకులో పుట్టాడు కాబట్టి, వాడికి ఖజాంచి (క్యాషియర్) అని పేరు పెట్టాలని అందరూ సలహా ఇచ్చారు" అని సర్వేషా చెప్పారు.

2016 నవంబర్ 8న కేవలం నాలుగు గంటల నోటీసు వ్యవధిలో నోట్ల రద్దును ప్రకటించారు మోదీ. లంచగొండితనం, పన్ను ఎగవేత, టెర్రర్ ఫైనాన్సింగ్ లక్ష్యాలుగా నోట్ల రద్దును ప్రకటించారని ప్రభుత్వం చెప్పింది. కానీ, దానివల్ల సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని నిపుణులు విమర్శించారు.

అయితే, ఖజాంచి కుటుంబానికి ఆ పేరు కలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖాజాంచిని ముందు పెట్టుకుని ప్రచారం చేసింది.

"వాడు మాకు డబ్బు, సంపదను తెచ్చిపెట్టాడు. అందరూ మాకు సహాయం చేస్తున్నారు. వాడికి ఆ పేరు పెట్టడం వల్లే మాకు ఇప్పుడు ఒక పక్కా ఇల్లు, చేతిలో డబ్బులు ఉన్నాయి" అని సర్వేషా దేవి చెప్పారు.

లాక్‌డౌన్ కక్కండి

లాక్‌డౌన్ కక్కండి, 2 సంవత్సరాలు

లాక్‌డౌన్ కక్కండి, 2020లో కోవిడ్ లాక్‌డౌన్ ప్రకటించిన వారం తరువాత పుట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుఖుండు గ్రామంలో ఆ బుజ్జిగాడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు.

"లాక్‌డౌన్ తారాస్థాయిలో ఉన్నప్పుడు మా అబ్బాయి పుట్టాడు. నా భార్యను ప్రసవానికి తీసుకెళ్లేందుకు బండి దొరకడం కష్టమైంది. చాలా మంది డాక్టర్లు రోగులకు చికిత్స చేయడానికి ముందుకు రాలేదు. మా అదృష్టం బావుండి, ఏ ఇబ్బందులు లేకుండా మా అబ్బాయి పుట్టేశాడు" అని లాక్‌డౌన్ తండ్రి పవన్ కుమార్ చెప్పారు.

లాక్‌డౌన్, వాళ్ల ఊరిలో, ఆ చుట్టుపక్కల చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ పిల్లాడి అడ్రెస్ అందరికీ తెలుసు. కొంతమంది పనిగట్టుకుని లాక్‌డౌన్‌ను చూడడం కోసం వస్తుంటారు.

"కొన్నాళ్లు వాడిని ఆ పేరు పెట్టి ఏడిస్తారేమో! కానీ, వాడిని ఎవరూ మర్చిపోలేరు. అందరికీ గుర్తుండిపోతాడు. ఆ సమయంలో ప్రజలు అనుభవించిన దానికి గుర్తుగా వాడి పేరు ఉండాలనుకున్నా. అందుకే లాక్‌డౌన్ అని పేరు పెట్టాను" అని పవన్ కుమార్ చెప్పారు.

2020 మార్చి 24న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. కేవలం కొన్ని గంటలు వ్యవధి ఇచ్చి లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్ర గందగోళానికి గురయ్యారు. నిత్యావసర సరుకులు అందక ఇబ్బంది పడ్డారు. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Azad Kapoor, Kargil Prabhu, Emergency Yadav... Who are they all? What is the history behind their names?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X