బడౌన్: బాలికల మృత దేహాలకు మరోసారి పోస్టుమార్టం
బడౌన్: గత మే నెలలలో ఉత్తరప్రదేశ్‌లోని బడౌన్ గ్రామంలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన ఇద్దరు మైనర్ బాలికల మృతదేహాలకు తాజాగా మరోసారి శవపరీక్ష నిర్వహించాలని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ నిర్ణయించింది. ఇందు కోసం ఖననం చేసిన వారి శవాలను తవ్వి తీయాలని సిబిఐ నిర్ణయించింది. 14, 15 ఏళ్ల వయసు కలిగిన ఈ ఇద్దరు మైనర్ బాలికల శవాలు గ్రామంలోని ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించడం తెలిసిందే.
ఈ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిపిన తర్వాత హత్య చేశారన్న ఆరోపణలు రావడం, దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. జూన్ నెలలో సిబిఐ ఈ కేసులోని మొత్తం అయిదుగురు నిందితులపై సత్యశోధన (లై డిటెక్టర్) పరీక్షలు పూర్తి చేసింది. వారి స్టేట్‌మెంట్లలో కొన్ని తేడాలున్నట్లు గుర్తించినట్లు కూడా తెలిపింది.

మృతుల కుటుంబ సభ్యులపైన కూడా ఇలాంటి పరీక్షలే నిర్వహిస్తామని సిబిఐ వర్గాలు తెలియజేశాయి. అయితే అంతకు మించి వివరాలు వెల్లడించడం వల్ల దర్యాప్తుకు విఘాతం కలగవచ్చని అంటూ వివరాలు వెల్లడించడానికి వారు నిరాకరించారు.
గత మే 27వ తేదీ రాత్రి కనిపించకుండా పోయిన ఈ బాలికలు ఆ మర్నాడు ఉదయం గ్రామంలోని మామిడి చెట్టుకు శవాలుగా వేళ్లాడుతూ కనిపించారు. ఈ బాలికలపై అత్యాచారం జరిపిన తర్వాత హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలు ధృవీకరించాయి. బాలికలు కనిపించకుండా పోయిన రోజు రాత్రే తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని బాలికల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications