కరెన్సీ నిషేధాన్ని అంత సీక్రెట్‌గా ఎలా ఉంచగలిగారు?
న్యూఢిల్లీ : దేశమంతా నివ్వెరపోయిన సందర్బం.. ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి, కాస్తంత ఆందోళనకు గురిచేసిన నిర్ణయం.. అంతా ఆకస్మికంగా జరిగిపోయింది. ఉన్నపలంగా నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించేయడంతో.. దేశమంతా ఒకటే చర్చ. మరి ఇంతటి అనూహ్య నిర్ణయాన్ని మోడీ ఏమాత్రం లీక్ అవకుండా ఎలా డీల్ చేయగలిగారో తెలుసా?
మంగళవారం సాయంత్రం కేబినెట్ భేటి మీటింగ్ కు హాజరయ్యేంతవరకు.. కేబినెట్ మంత్రులకు కూడా రూ.500,రూ.1000నోట్ల రద్దుపై ఏమాత్రం సమాచారం లేదు. పైగా కేబినెట్ సమావేశాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దంటూ అంతకు కొద్దిరోజుల ముందే ఆయా కేబినెట్ మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి కేబినెట్ సెక్రటరీ నోటీసులు జారీ చేయడం కూడా.. విషయం బయటకు పొక్కకుండా ఉండడానికి ముందస్తుగా అమలుపరిచిన వ్యూహం.

కాగా, భేటీ అనంతరం మంత్రులు బయటకొస్తే.. విషయం లీక్ అవకాశం ఉండడంతో.. రాష్ట్రపతిని కలిసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించేవరకు మంత్రులెవరూ మీటింగ్ హాల్ నుంచి బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఆ సమయంలో.. రిజర్వ్ బ్యాంకు బోర్డు సభ్యులు కూడా మీటింగ్ హాల్ లోనే ఉండడం గమనార్హం. వాస్తవానికి ఒకే సమయంలో రెండు సమావేశాలు ప్లాన్ చేయడంతో.. జపాన్-భారత్ మధ్య ఏదో మోసపూరిత ఒప్పందం జరగబోతుందన్నట్టుగా వార్తలు వచ్చాయి.
కానీ ఊహాగానాలకు తెరదించుతూ.. కేబినెట్ మంత్రులు, ఆర్బీఐ అధికారులతో 6.45గం.లకు భేటీ నిర్వహించారు మోడీ. 7.30గం.లకు సమావేశం ముగిసిన వెంటనే.. కేబినెట్ మంత్రులను, ఆర్బీఐ అధికారులను మీటింగ్ హాల్ లోనే ఉంచి, తన నిర్ణయాన్ని రాష్ట్రపతి వద్దకు వెళ్లి తెలియజేశారు. ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అనంతరం మరోసారి ముగ్గురు సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు ప్రధాని. ఆ తర్వాత నేరుగా జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగం ప్రారంభించిన మోడీ.. అసలు విషయాన్ని వెల్లడించారు.












Click it and Unblock the Notifications