యువతి ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారి: అరెస్ట్
బెంగళూరు: ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ఓ ఐపిఎస్ అధికారి.. తన బాధ్యతను మరిచి అనుమతి లేకుండా ఓ యువతి ఫొటోను తీసి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్‌లో తన ఫొటోలు తీశారంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు సీనియర్ ఐపిఎస్ అధికారి, అదనపు పోలీసు డీజీ పి. రవీంద్రనాథ్'పై ఐపిసి 354, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డిసిసి(సెంట్రల్) రవికాంత్ గౌడ్ తెలిపారు.
పోలీసు అధికారుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం రవీంద్రనాథ్ బెంగళూరు కన్నింగ్ హ్యాం రోడ్డులోని కాఫీ షాప్‌కు వెళ్లాడు. అక్కడున్న యువతి, యువకులను మొబైల్‌లో ఫొటోలు తీశారంటూ ఓ యువకుడు ఆరోపించడంతో వాగ్వివాదం తల్లెత్తింది. అక్కడున్న వారు రవీంద్రనాథ్‌పై దాడికి దిగినట్లు తెలిసింది. అక్కడికి చేరుకున్న గస్తీ పోలీసులు అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాగా, రవీంద్రనాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. యువతి ఫొటో తీయలేదని చెప్పారు. కాఫీ షాప్‌లో కాఫీ తాగుతుండగా పైఅంతస్తులో కూర్చున్న వ్యక్తి హఠాత్తుగా వచ్చి మొబైల్ ఫోన్, పర్సు లాకున్నాడని చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. లాకప్‌లో బంధించి చిత్రహింసలకు గురి చేసి అవమానించారని ఆరోపించారు.
తాను తన పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం సాయంత్రం ఆయన ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా హోంమంత్రి జార్జి మాట్లాడుతూ.. రవీంద్రనాథ్ రాజీనామా చేయలేదని చెప్పారు. అపరిచిత వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కాగా, మొబైల్ ఫోన్‌లో యువతి ఫొటులు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.












Click it and Unblock the Notifications