విజయ మాల్యా ఆఫర్: బకాయిలపై తగ్గిన బ్యాంకులు
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాలకు ఎగనామం పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ మాల్యాతో సెటిల్మెంట్‌కు బ్యాంకులు సిద్ధమయ్యాయి. విజయ మాల్యా తమ అప్పులు తిరిగి ఇవ్వాలని అవి చెబుతున్నాయి. మాల్యా తాజా నిర్ణయంపై బ్యాంకులు స్పందించాయి.
మీడియాలో వస్తున్న వార్తల మేరకు... తమకు రుణాల వసూలు మాత్రమే ముఖ్యమని బ్యాంకులు వెల్లడించాయి. మాల్యా.. తాను తిరిగి వచ్చి రుణాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తానని, అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం హామీ ఇస్తేనే ఇది జరుగుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం స్పందించింది. మాల్యా ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి హామీ లభిస్తే ఆయన భారత్ వచ్చినా ఇబ్బంది పెట్టబోమన్న సంకేతాలు ఇచ్చాయి. మొత్తం 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్, యూబీ గ్రూప్‌లకు రూ. 7 వేల కోట్ల రుణాలిచ్చాయి.

ఆయన తీసుకున్న అసలు రూ.6,868 కోట్లను సుప్రీం కోర్టుకు డిపాజిట్ చేయాలని సూచించగా, బ్యాంకులు అందుకు అంగీకరించకుండా తమకు వడ్డీ సహా పూర్తి వసూళ్లు రావాల్సిందేనని స్పష్టం చేశాయి. అయితే, అంతమొత్తం రావాలంటే కష్టసాధ్యమని భావించిన బ్యాంకులు ఇప్పుడు వెనక్కు తగ్గాయి.
తమకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వ రక్షణ లభించే పక్షంలో తాము ఆయనను ఇబ్బంది పెట్టబోమని ప్రముఖ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే, కాగ్ లేదా సీబీఐ కవర్ లేకుండా ఏ బ్యాంకరైనా ఆయనతో డీల్ కుదుర్చుకునేందుకు ముందుకు రాకపోవచ్చని మరో బ్యాంకు ప్రతినిధి అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications