రాజపక్స రుణాన్ని భారత్ ఆ రకంగా తీర్చుకుందా: పారిపోవడానికి సహకరించిందా? హైకమిషన్ ఏం చెబుతోంది
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తాజాగా దేశం విడిచి పారిపోయారు. ఇదివరకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వేల సంఖ్యలో ప్రజలు దండెత్తడంతో ఆయన తన అధికారిక నివాసాన్ని వదిలి వెళ్లారు. ఇన్ని రోజులు ఆయన నౌకాదళాధికారుల ఆశ్రయంలో గడిపారు. నౌకాదళానికి చెందిన ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు షిప్‌లో గడిపారు. ఇప్పుడు తాజాగా ఆయన దేశం విడిచి పారిపోయారు. వెళ్లే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు.

మాల్దీవుల్లో ల్యాండ్..
ఆయన రాజీనామా చేసిన విషయాన్ని తాత్కాలిక ప్రధాని రణిల్ విక్రమసింఘె ఇవ్వాళ పార్లమెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. రాజపక్స స్థానంలో రణిల్ విక్రమసింఘె అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారని తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకూ ఆయన కొనసాగుతారని అక్కడి మీడియా చెబుతోంది. గొటబయ రాజపక్స మాల్దీవులకు వెళ్లారు. మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆంటొనొవ్-32లో ఆయన దేశం దాటారు. భార్య, వ్యక్తిగత భద్రత సిబ్బంది, మరో నలుగురు మాత్రమే ఉన్నట్టు శ్రీలంక మీడియా పేర్కొంది.
ధృవీకరించిన పీఎంఓ..
గొటబయ దేశం విడిచి పారిపోయిన విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది కూడా. ప్రస్తుతం గొటబయ శ్రీలంకలో లేరని స్పష్టం చేసింది. శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. గొటబయ తమ దేశంలో లేరని పేర్కొంటూ ప్రధానమంత్రి కార్యాలయం మీడియా డివిజన్ స్పష్టం చేసింది. ఈ తెల్లవారు జామున 3 గంటలకు గొటబయ..మాల్దీవుల రాజధాని మాలీలో ఆయన ల్యాండ్ అయినట్లు పేర్కొంది.
ప్రజాగ్రహానికి..
ఈ నెల 9వ తేదీన వేలాదిమంది ఆందోళనకారులు ఆయన అధికార నివాసం మీదికి దండెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రాజపక్స తన కుటుంబంతో సహా నివాసాన్ని వీడారు. ఓ అంబులెన్స్‌లో ఆయన పారిపోయారు. అనంతరం గజబాహు షిప్‌లో తలదాచుకున్నారు. రాజపక్స పారిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె కూడా తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరినట్టయింది.

మరో వివాదం..
గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన అనంతరం మరో కొత్త వివాదం తెర మీదికి వచ్చింది. ఆయన పారిపోవడం వెనుక భారత్ హస్తం ఉందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. గొటబయను భారత్ స్వయంగా దేశం దాటిచ్చిందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. వీటిని భారత్ తోసిపుచ్చింది. ఆ వార్తలన్నీ నిరాధారమైనవిగా, ఊహాజనితమైనవిగా తేల్చి చెప్పింది. శ్రీలంకతో తమ సహకారాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం వరుస ట్వీట్లు చేసింది.












Click it and Unblock the Notifications