బంగాళాఖాతంలో ఆవర్తనం- దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. క్రమంగా ఈ వర్షాలు తమిళనాడు ఉత్తరం, ఏపీ దక్షిణ ప్రాంత జిల్లాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

ఆ తరువాత మళ్లీ రుతు పవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా- ఉష్ణోగ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడిగాలులూ వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. నడివేసవి పరిస్థితులను చవి చూశారు.
ఇప్పుడు తాజాగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రుతుపవనాలు కనికరించకపోయినప్పటికీ- బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా.. ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.
ఇప్పుడు తాజాగా తమిళనాడుపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై, కాళ్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు, అరియలూరు, మైలాడుతురై, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇదే పరిస్థితి బుధవారం కూడా కొనసాగుతుంది.
బుధవారం నాటికి తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, తిరుచిరాపల్లి, అరియలూరు, కడలూరు, పుదుక్కోట్టై, పెరంబలూరు, విల్లుపురం, తిరువణ్ణామలై, కాళ్లకురిచ్చి, ధర్మపురి, కృష్ణగిరి, నీలగిరి వంటి 15 జిల్లాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిందీ ఐఎండీ. గురువారం కోయంబత్తూరు, నీలగిరి, తేని, తెన్‌కాశి, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కాంచీపురం వంటి 12 జిల్లాల్లో వర్షపాతం 64.5 మిమీ - 115.5 మిల్లీ మీటర్ల వరకు ఉండొచ్చు.












Click it and Unblock the Notifications