498-ఎ కేసు పెట్టగానే అరెస్టు చేయవద్దు: కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం కొన్ని సూచనలను జారీ చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ మహిళలు చేసే ఫిర్యాదులతో 498 - ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినా వెంటనే ఎవరినీ అరెస్టు చేయవద్దని సూచించింది.
వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని, భర్త తరపు బంధువులపై కేసులు పెట్టేందుకు దానిని వినియోగించుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, కేసు నమోదు చేసిన తరువాత పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఆ తర్వాత అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది.
దీంతో కేసు నమోదు అయిన తరువాత పూర్వాపరాలు పరిశీలించి, అవసరమనుకుంటేనే అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు పోలీసులుకు తగు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

భార్యా, భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో సెక్షన్ 498 - ఎ ను కొంత మంది ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. దీంతో 498 - ఏ సెక్షన్ మీద కేసు నమోదు చేసినా వెంటనే ఎవరినీ అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది.
భరణం ఇవ్వాల్సి వస్తే పేద కబుర్లు
ఇది ఇలా ఉంటే పెళ్లి సందర్భంగా యువకులు రాకుమారుడిలా ఫోజులు కొడతారని, తీరా ఆ పెళ్లి పెటాకులై భార్య, బిడ్డలకు భరణం ఇవ్వాల్సి వస్తే పేద కబుర్లు చెప్తారని ఢిల్లీలోని ఓ న్యాయస్ధానం అభిప్రాపడింది. ఓ విడాకుల కేసులో భార్య, చదువుకుంటున్న పిల్లలకు ఓ వ్యక్తి చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఖర్చును న్యాయస్ధానం రూ. 3 వేల నుంచి 5 వేలకు పెంచుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications