రూ.2లక్షల ఫేక్ చెక్ ఇచ్చి, 60వేల ఐఫోన్ కొట్టేశాడు
బెంగళూరు: ఫేస్‌బుక్ పరిచయం వల్ల ఓ మహిళ రూ.60 వేల విలువైన ఐ ఫోన్‌ను పోగోట్టుకుంది. ఈ సంఘటన కర్నాటకలో జరిగింది. 45 ఏళ్ల మహిళకు 25 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయమైన వ్యక్తి ఆమె ఐఫోన్‌ను కొట్టేశాడు.
ఆ వ్యక్తి.. తాను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు దగ్గరి బంధువును అని కూడా ఆ మహిళను నమ్మించాడు. వీణ (45) అనే మహిళ తన తల్లి మృతి నేపథ్యంలో ఓ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టింది. నిజు అనే యువకుడు ఆ పోస్ట్ చూశాడు. ఆ తర్వాత వీణ, నిజులు స్నేహితులయ్యారు.
ఫిబ్రవరి నెలలో వీరిద్దరు కలుసుకున్నారు. ఆ సమయంలో యువకుడు నిజు.. వీణకు రూ.2 లక్షల చెక్కును ఇచ్చాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా వచ్చినప్పుడు ఉపయోగించుకోమని చెప్పి ఇచ్చాడు.

ఆ తర్వాత ఫిబ్రవరి 8వ తేదీన, వీణకు ఓ బహుమతిని కొనిస్తానని చెప్పి నిజు యాపిల్ షోరూంకు తీసుకు వెళ్లాడు. రూ.60వేల ఐ పోన్ కొనుగోలు చేశాడు. అయితే, తాను తన క్రెడిట్ కార్డు తీసుకు రాలేదని, ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వమని, తర్వాత ఇస్తానని వీణకు చెప్పాడు. దీంతో వీణ ఆ మొత్తాన్ని ఇచ్చింది.
ఫోన్ తీసుకొని బయటకు వచ్చాక... ఐఫోన్‌లో కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేస్తానని పక్కకు వెళ్లాడు. అతను వస్తాడని వీణ చాలాసేపు నిరీక్షించింది. అతను ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో ఆమె అథని ఫోన్‌కు రింగ్ చేసింది. కానీ అతను అందుబాటులోకి రాలేదు.
చాలాసేపు నిరీక్షించిన ఆమె ఆ తర్వాత తన ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు వీణ... నిజు గతంలో ఇచ్చిన రూ.2 లక్షల చెక్కుతో బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలని చూసింది. అయితే అతని అకౌంటులో డబ్బుల్లేవని తేలింది.
అతను తనను మోసం చేశాడని ఆమె అప్పుడు అర్థం చేసుకుంది. దీంతో ఆమె కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నిజు చెన్నైకి చెందినవాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను చెప్పినట్లుగా జయలలిత బంధువు మాత్రం కాదు.












Click it and Unblock the Notifications