నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణస్వీకారం-25 మంది మంత్రులూ-మోడీ,షా హాజరు !
గుజరాత్ లో వరుసగా ఏడోసారి ఘన విజయం సాధించిన బీజేపీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. సీఎంగా ఉంటూ పార్టీని అధికారంలోకి తెచ్చిన భూపేంద్ర పటేల్.. మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇవాళ గాంధీ నగర్ లో అట్టహాసంగా జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూపేంద్ర పగ్గాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
గతేడాది సెప్టెంబర్ లో విజయ్ రూపాణీ స్ధానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్.. ఈసారి ఎన్నికల్లో తాను మరోసారి విజయం సాధించడమే కాకుండా పార్టీని కూడా గెలిపించారు. దీంతో ఆయన్ను మరోసారి సీఎంగా కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు భూపేంద్ర ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 25 మంది మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఇప్పటికే వీరికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

గుజరాత్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. మోడీ, షాతో పాటు కేంద్రమంత్రులు గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, పలువురు బీజేపీ రాష్ట్రాల సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే 200 మంది సాధువుల్ని కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అన్ని కులాలు, మతాలు, వర్గాల వారిని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 156 సీట్లు గెల్చుకుని సంచలనం సృష్టించింది. అలాగే 53 శాతం ఓట్లను కూడా సాధించింది. దీంతో మంత్రివర్గ ఎంపికతో పాటు అన్ని అంశాల్లోనూ అధిష్టానం సూచించిన వారికే ప్రాధాన్యం దక్కబోతోంది.












Click it and Unblock the Notifications