కాంగ్రెస్ పార్టీ అకౌంట్లన్నీ ఫ్రీజ్- అంతలోనే ట్రైబ్యునల్ ఉత్తర్వులతో రిలీఫ్..!
సార్వత్రిక ఎన్నికలకు సిద్దవుతున్న ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఉదయం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐటీ శాఖ తమ పార్టీకి చెందిన అన్ని ఖాతాల్ని ఫ్రీజ్ చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఐటీ ఉల్లంఘనలకు సంబంధించి ఆదాయపన్ను శాఖ తమ ఖాతాలన్నీ నిలిపేసిందని, రూ.210 కోట్లు కడితేనే వాటిని తెరుస్తామని చెప్పిందని మాకెన్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ వెంటనే ఐటీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. దీనిపై వెంటనే విచారణ జరిపిన ఐటీ ట్రైబ్యునల్ కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. ఐటీ శాఖ స్తంభింపచేసిన ఖాతాలన్నీ తిరిగి తెరవాలని టైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఐటీ శాఖ ఆయా ఖాతాల్ని తెరిచినట్లు తెలుస్తోంది. అంతకు ముందు యూత్ కాంగ్రెస్ సహా పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఎన్నికల వేళ సంచలనంగా మారింది.

ఐటీ శాఖ చర్యలపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రజాస్వామ్య ప్రక్రియకు కలవరపెట్టే దెబ్బగా అభివర్ణించారు. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూ.210 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు తర్వాత ఈ ఖాతాల్ని స్తంభింపచేసినట్లు ఆయన తెలిపారు. ఈ చర్య రాజకీయ ప్రేరేపిమతమని, తమ పార్టీ ఎన్నికల సన్నాహాలను అంతరాయం కలిగించడానికి వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా అధికార మత్తులో, మోడీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేసింది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర దెబ్బ అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications