గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంలో భారీ ఊరట-బళ్లారి, కడప, అనంతపురం టూర్ కు అనుమతి
ఓబుళాపురం మైనింగ్ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్నాటక బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. ఆయన్ను స్వస్ధలం బళ్లారితో పాటు ఏపీలోని కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది.
సీబీఐ నమోదు చేసిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి పర్యటనలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వస్ధలం బళ్లారికి అయితే అస్సలు వెళ్లొద్దని సుప్రీంకోర్టు గతంలో ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో బెయిల్ పై బయటికి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి స్వస్ధలం బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరారు. బళ్లారితో పాటు ఏపీలోని కడప, అనంతపురం జిల్లాల్లోనూ పర్యటించేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది.

గాలి జనార్ధన్ రెడ్డి పర్యటనలకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పడంతో ఇవాళ ఆయనకు అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్ధానం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో గాలిపై నమోదైన మైనింగ్ కేసు విచారణ పెండింగ్ లో ఉండటంతో అప్పటి వరకూ ఆయన్ను స్వస్ధలానికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు గాలి జనార్ధన్ రెడ్డి టూర్ కు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో హైదరాబాద్ సీబీఐ కోర్టు గాలిపై నమోదైన ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించింది.
Recommended Video
2015లో బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా విధించిన ఆంక్షలను సడలించాలని, బళ్లారి, కడప, అనంతపురంలో 8 వారాల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును గాలి జనార్దన్ రెడ్డి కోరారు. దీంతో విచారణ జరిపి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు... ఈ కేసుపై పూర్తిస్ధాయి విచారణ 3 నెలల తర్వాత చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు విచారణను నవంబర్ మూడో వారంలో లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రిజిస్ట్రీని కోరింది












Click it and Unblock the Notifications