మహారాష్ట్ర సర్కార్ కు భారీ షాక్-12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
మహారాష్ట్రలోని అధికార మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ నుంచి 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసింది. అంతే కాదు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దురుసు ప్రవర్తన కారణంగా మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తూ గతంలో ప్రభుత్వం ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక సెషన్‌కు మించి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానం రాజ్యాంగ విరుద్ధం,, చట్టవిరుద్ధం, అసెంబ్లీ అధికారాలకు అతీతమైనదని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సస్పెన్షన్ కేవలం వర్షాకాల సమావేశానికి మాత్రమే పరిమితం కావచ్చని పేర్కొంది.

ఇలాంటి తీర్మానాలు చాలా హానికరమైనవని సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఆయా ఎమ్మెల్యేలు తిరిగి అసెంబ్లీకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. దీనిపై స్పందిస్తూ విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్... సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ గతంలో సస్పెండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేల్లో సంజయ్ కుటే, ఆశిష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భత్కల్కర్, పరాగ్ అలవ్ని, హరీష్ పింపాలే, రామ్ సత్పుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే మరియు కీర్తికుమార్ బంగ్డియా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో వీరికి భారీ ఊరట లభించనట్లయింది.












Click it and Unblock the Notifications