ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్ధానిక కోటా-కొట్టేసిన హైకోర్టు...
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. కానీ ప్రైవేటు రంగంలో మాత్రం రిజర్వేషన్లు కల్పించడం వివాదాలకు కారణమవుతోంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెడుతూ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలో 75 శాతం స్ధానిక కోటా కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం మూడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇవాళ కొట్టేసింది.
ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాల్లో హర్యనాలో స్ధానికులకు 75శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేసే వివాదాస్పద హర్యానా చట్టాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. అంతే కాదు ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ స్థానిక అభ్యర్థుల చట్టం 2020లో గతంలో పలు మార్పుల్ని ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది.

ఇందులో నెలవారీ జీతం రూ.30,000 కంటే తక్కువ వేతనాలతో 75 శాతం ప్రైవేట్ రంగ ఉద్యోగాలు స్ధానికంగా నివసిస్తున్న వారు లేదా నివాస ధృవీకరణ పత్రం కలిగి ఉన్న వారికి కేటాయించాలని నిర్ణయించారు. అలాగే స్ధానికులుగా నిర్ధారించేందుకు గతంలో ఉన్న 15 ఏళ్ల కాలాన్ని ఐదేళ్లకు తగ్గించారు.
హర్యానాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ ప్రైవేటు రంగంలో స్ధానిక ఉద్యోగాల కోటాతో లబ్ది పొందాలని బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం భావించింది. అయితే హైకోర్టు నిర్ణయంతో ఇప్పుడు ఆ చట్టం కాస్తా రద్దయింది. స్థానికుల ఓట్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేయడం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications