పరీక్ష రద్దు చేయాల్సిందే! కట్టలు తెంచుకున్న ఆగ్రహం. పట్నాలో హై టెన్షన్
తన హక్కుల సాధన కోసం నిరుద్యోగ సమూహం తిరగబడితే ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు. బీహార్ రాజధాని పట్నా వేదికగా మంగళవారం సరిగ్గా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అభ్యర్థులు, విద్యార్థులు కదం తొక్కారు.
గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు ఉవ్వెత్తున ఎగిసిపడిన ఈ సునామీ తరహా నిరసన ప్రదర్శనలో.. పోలీసులు అడ్డుగా పెట్టిన భారీ బారికేడ్లను సైతం విద్యార్థులు సైతం తోసేసి ముందుకు ఉరికారు. ఈ క్రమంలోనే పోలీసులు ఫైర్ ఇంజన్ల సాయంతో ఆందోళన కారులపై వాటర్ కెనాన్స్ ను ప్రయోగించారు. దీంతో నిరసనకారులు మరింత ముందుకు చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఠాణాకు తరలించడంతో పట్నా వీధులు అట్టుడికాయి.

పరీక్షల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల వేలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెడుతుందని విద్యార్థి లోకం మండిపడుతోంది. గడిచిన 9 రోజులుగా అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడమే ఈ స్థాయిలో ఆగ్రహం వెల్లువెత్తడానికి కారణమైంది.
#WATCH | Patna, Bihar: Police use water cannons to disperse the students marching towards Raj Bhavan from Gandhi Maidan, demanding cancellation of the 70th BPSC examination. pic.twitter.com/MIS6wx3dkP
— ANI (@ANI) August 25, 2026
కేవలం 70వ BPSC రద్దు మాత్రమే కాకుండా, ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియను రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో నిర్వహించాలని, నెగెటివ్ మార్కింగ్‌ను పూర్తిగా ఎత్తివేయాలని అభ్యర్థులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.
శాంతియుత చర్చలకు సిద్ధం: పోలీసుల పహారా!
విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో నిరోధక ప్రాంతాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. నిరసనకారులు రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆందోళనకారులతో ఉన్నతాధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారని, సమస్యను శాంతియుతంగా పరిస్కరించుకునేందుకు విద్యార్థి సంఘాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు డీఎస్పీ కామాఖ్య నారాయణ్ సింగ్ తెలిపారు. ఒకవేళ విద్యార్థులు శాంతించకపోతే చట్టరీత్యా ముందుకు వెళ్లకుండా నిరోధిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని పిలిచి ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకుడు సుశీల్ కుమార్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి తేజస్వీ యాదవ్ లేఖ.. ఉద్యమానికి లభిస్తున్న మద్దతు!
నిరుద్యోగుల ఆందోళనకు ప్రతిపక్షాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్.. ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికి బహిరంగ లేఖ రాశారు. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులతో చర్చలు జరపాలని ఆయన కోరారు. BPSC, BSSC, సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు ప్లానింగ్ నోటిఫికేషన్లు, ఉద్యోగ క్యాలెండర్లను పారదర్శకంగా ప్రకటించాలని.. నియామక ప్రక్రియల్లో అక్రమాలకు పాల్పడే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని తేజస్వీ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సత్వర సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం ఆగేలా కనిపించడం లేదు.














Click it and Unblock the Notifications