
రావత్‌కు నివాళి: పాలెం ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీ అంజలి, త్రివిధ దళాల అధిపతులు కూడా..
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఇతర ఆర్మీ అధికారుల మృతదేహాలు మరికాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నాయి. ఢిల్లీలో గల పాలెం విమానాశ్రయంలో ప్రముఖులు నివాళి అర్పిస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో రావత్‌తోపాటు మృతుల భౌతిక కాయాలను ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సందర్శించారు. వారికి నివాళులు అర్పిస్తారు. త్రివిధ దళాల అధిపతులు కూడా ఎయిర్ పోర్టుకు వస్తారని తెలుస్తోంది.

అంజలి
బిపిన్ రావత్‌తో పాటు మృతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరగనున్నాయి. తమిళనాడులోని కూనూర్‌లో హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్వాడ్రన్ లీడర్ కే సింగ్, జేడబ్ల్యూఓ దాస్, ప్రదీప్, సత్పాల్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ సాయితేజ మరణించారు.

ఇదివరకు కలాం..
ఇదివరకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చనిపోయిన సమయంలో కూడా ఇదేవిధంగా ఎయిర్ పోర్టులో నివాళులు అర్పించారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ.. త్రివిధ దళాల అధిపతులు నివాళి అర్పించారు. ఇప్పుడు రావత్‌కు నివాళి అర్పించనున్నారు.

విషాద వదనం
త్రివిధ దళాల చరిత్రలో విషాద ఘటన సీడీఎస్ బిపిన్ రావత్ మృతి.. తాను శిక్షణ పొందిన డిఫెన్స్ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతూ తమిళనాడులోని నీలగిరి వద్ద నంజప్పన్ ఛత్రం వద్ద హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. అర్ధాంగి మధులిక సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందారు. రావత్ మరణవార్త యావత్ దేశాన్ని కుదిపివేసింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video

ఇదీ నేపథ్యం
బిపిన్ రావత్ స్వస్థలం ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్. ఆయనది సైనిక కుటుంబం. రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ కూడా సైనిక ఉన్నతాధికారే. దాంతో తండ్రి బాటలోనే రావత్ కూడా సైన్యంలోకి వచ్చారు. భారత ఆర్మీతో ఆయన అనుబంధం 1978లో మొదలైంది. గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ లో ప్రస్థానం ప్రారంభించిన రావత్ అంచెలంచెలుగా ఎదిగారు. సైన్యంలో చేరిన ఏడాదే సెకండ్ లెఫ్టినెంట్ హోదా సాధించారు.