వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్ కాయిన్: సెల్ ఫోన్ హాక్ చేసి రూ.25 లక్షలు దోచేశారు-ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిట్ కాయిన్లు దోచేశారు

దోపిడీలకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ఎంచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు ఒక సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి బిట్ కాయిన్ల రూపంలో ఉన్న మొత్తాన్ని కొట్టేశారని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

హాట్‌ మెయిల్‌ ద్వారా సందేశం పంపిన సైబర్‌ నేరస్థులు ఓ వ్యక్తి ఫోన్‌ను హ్యాక్‌ చేసి అతని వ్యాలెట్‌ నుంచి రూ.25 లక్షలు కొట్టేశారు.

సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ డబ్బు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు సైబర్‌ నేరగాళ్లు తొలిసారి సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.

బాధితుడికి నేరగాళ్లు పంపించిన సందేశాల ఆధారంగా పోలీసులు మోసం జరిగిన తీరును విశ్లేషించారు. అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతారంటూ సెల్‌ఫోన్‌ వినియోగదారులను హెచ్చరిస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు.. మొదట సెల్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. లాటరీలు, బహుమతులు అని ఎర వేస్తూ వారి ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.

ఈ కేసులో బాధితుడికి కూడా ఇలాగే రెండు, మూడు ఎస్‌ఎంఎస్‌లు రాగా.. వాటిని యథాలాపంగా క్లిక్‌ చేశారు. వెంటనే ఆయన వివరాలన్నీ సైబర్‌ నేరగాడికి చేరిపోయాయి.

ఇలా సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసిన ఆ నేరగాడు.. బాధితుడు బిట్‌ కాయిన్లు కొని వ్యాలెట్‌లో దాచుకున్నాడని గుర్తించాడు.

ఆ వెంటనే 35 వేల అమెరికన్‌ డాలర్లను (దాదాపు రూ.25 లక్షలు) బదిలీ చేసుకున్నాడు. ఆ లావాదేవీల వివరాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు, వ్యాలెట్‌ సందేశాలను ఫోన్‌లోంచి తొలగించాడు.

దీంతో బాధితుడు.. తన వ్యాలెట్‌లోని డాలర్లను కోల్పోయినట్లు వెంటనే గుర్తించలేకపోయారు. తర్వాత చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు ఓ ఎస్‌ఎంఎస్‌ యూఎస్‌ నుంచి, మరోటి ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించినట్లు ఈనాడు వివరించింది.

లైంగిక దాడి

కన్న కూతురిపైనే లైంగిక దాడి

కడప జిల్లాలో కన్న కూతురికి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు డీఎస్పీ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌ తెలిపారు. సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి.. వైఎస్సార్‌ జిల్లాలో పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఇదిలా ఉండగా ఆ ఉద్యోగి తన 15 ఏళ్ల కుమార్తెను గత నెల 25న తన ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి.. కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు.

ఆపై కుమార్తెపై లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో సెల్‌ఫోన్‌తో వీడియో తీయించాడు. ఈ ఘటన గురించి బాధిత బాలిక ఇంటికొచ్చాక తన తల్లితో చెప్పిందని పోలీసులు తెలిపారు.

అదే రోజు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో తల్లితో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ నెల 2వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ నాగరాజు చెప్పారు.

నిందితుడి వద్ద ఉన్న సెల్‌ ఫోన్, అందులోని వీడియో, ఫొటోలను సీజ్‌ చేసినట్టు వారు తెలిపారని సాక్షి వివరించింది.

జైకోవ్-డి టీకా ధరపై ప్రభుత్వానికి ప్రతిపాదన

జైడస్ క్యాడిలా సంస్థ తాము తయారు చేసిన జైకోవ్-డీ టీకా ధరను ప్రతిపాదించినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్త ప్రచురించింది.

తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా జైకోవ్‌-డీ ధరను రూ.1900గా జైడస్‌ క్యాడిలా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

అయితే, ధర తగ్గింపుపై ఈ సంస్థతో కేంద్రం చర్చలు జరుపుతోంది.

జైకోవ్‌-డీ మూడు డోసుల టీకా. 12 సంవత్సరాలు పైబడినవారికి ఇస్తారు. ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా టీకా ఇది.

సూది లేకుండా జెట్‌ ఇంజక్టర్‌ అనే పరికరం సాయంతో దీనిని వేస్తారు. మొదటి డోసు వేసుకొన్న 28 రోజులకు రెండో డోసు, 56 రోజులకు మూడో డోసు వేసుకోవాలి.

అత్యవసర వినియోగం కింద జైకోవ్‌-డీకి డీసీజీఐ ఇప్పటికే అనుమతినిచ్చిందని నమస్తే తెలంగాణ వివరించింది.

భూముల కుంభకోణం

చిత్తూరు జిల్లాలో భారీ కుంభకోణం

చిత్తూరు జిల్లాలో నకిలీ పత్రాలతో 13 మండలాల్లో 2,320 ఎకరాల ప్రభుత్వ భూమికి ఓ కుటుంబం హక్కు పత్రాలను సృష్టించిన విషయం బయటపడిందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఇందులో తొమ్మిది మండలాల్లోని 1,577 ఎకరాలను వ్యక్తిగత ఆస్తులుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని తెలిపారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం తిరుపతి సీఐడీ కార్యాలయంలో డీఎస్పీ రవికుమార్‌ మీడియాకు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి వరకు చదువుకున్న యాదమరి మండలం 184 గొల్లపల్లి గ్రామ నివాసి మోహన్‌ గణేశ్‌ పిళ్లై (71) గొల్లపల్లి గ్రామ కరణంగా పనిచేశాడు.

1984లో ఆ వ్యవస్థ రద్దవడంతో ఉద్యోగం కోల్పోయాడు. 1992లో వీఏవోగా ఉద్యోగం పొందాడు. ఆ తర్వాత పదోన్నతిపై గొల్లపల్లి వీఆర్వోగా పనిచేస్తూ 2010లో పదవీవిరమణ చేశాడు.

రెవెన్యూ అంశాలపై పిళ్లైకే కాకుండా ఆయన నలుగురు పిల్లలు కోమల, ధరణి, మధుసూదన్‌, నటరాజన్‌ అలియాస్‌ రాజన్‌కు కూడా పూర్తి పరిజ్ఞానముంది.

వీరంతా కలసి జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పథకం పన్నారు.

పిళ్లై తల్లి అమృతవల్లెమ్మ తన యావదాస్తిని తన మరణానంతరం తన ఇద్దరు మనవరాళ్లు, ఇద్దరు మనవళ్లకు చెందేటట్లు 1985 ఆగస్టు 16వ తేదీన వీలునామా రాసినట్లుగా నకిలీ వీలునామా సృష్టించారు.

తన తల్లి మరణానంతరం 1985లో బంగాపాళ్యం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దీనిని రిజిస్టర్‌ చేయించారు.

అలాగే తన తండ్రి శ్రీనివాస పిళ్లైకు వారసత్వంగా సంక్రమించిన భూములపై తన హక్కులు వదులుకుని తన తల్లి అమృతవల్లెమ్మ పేరిట బదిలీ చేస్తున్నట్లుగా కుమారుడు మధుసూదన్‌ సాయంతో తప్పుడు హక్కు పత్రాన్ని కూడా తయారు చేయించాడు.

అందులో జిల్లాలోని 13 మండలాల్లోని 18 గ్రామాల్లో, 93 సర్వే నంబర్లలోని 2,320 ఎకరాల భూమిపై తన తండ్రికి ఉన్న హక్కును తన తల్లికి బదలాయిస్తున్నట్లు రాయించాడు.

నకిలీ హక్కు పత్రాన్ని అసలైనదిగా నమ్మించేందుకు.. జమీందారు భూములు మంజూరు చేసినట్లుగా ఖాళీ పట్టాఫారాలను సేకరించి.. వాటిలో తమ పూర్వీకుల పేర్లు రాయించి, వారి ద్వారా తమకు పూర్తి హక్కులు సంక్రమించినట్లు నకిలీ పట్టాలు తయారు చేయించారు.

ఆయా మండల కార్యాలయాల్లో ఖాళీ భూమిశిస్తు రశీదులను సేకరించి పన్ను చెల్లించినట్లు ఆధారాలు కూడా సృష్టించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bitcoin: Cell phone hacked, Rs 25 lakh stolen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X