రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం- బీజేపీ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు బీజేడీ మద్దతు..!
రాజ్యసభకు ఖాళీ అవుతున్న 56 సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో ఓ సంచలనం నమోదైంది. ఈ నెల 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. ఇందులో పలువురు కేంద్రమంత్రులకు తిరిగి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు అవకాశం లభించింది. వీరిలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, సమాచార మంత్రి ఎల్ మురుగన్ తో పాటు పలువురు ఉన్నారు.
అయితే ఇందులో ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కూడా రెన్యువల్ లభించింది. అదే సమయంలో బీజేపీకి చెందిన అశ్వినీ వైష్ణవ్ కు రాజ్యసభ ఎన్నికల్లో మద్దతిచ్చేందుకు స్ధానిక అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) కూడా ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని వైష్ణవ్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు బీజేడీ ఇవాళ ప్రకటించింది. దీంతో బీజేపీ-బీజేడీ ఉమ్మడి అభ్యర్ధిగా అశ్వినీ వైష్ణవ్ సునాయాసంగా రాజ్యసభకు ఎంపిక కానున్నారు.

2019లోనూ బీజేపీ తరఫున రాజ్యసభ అభ్యర్ధిగా పోటీ చేసిన అశ్వినీ వైష్ణవ్ కు బీజేడీ మద్దతిచ్చింది. దీంతో అప్పట్లో కూడా ఆయన సునాయాసంగా గెలిచారు. ఈసారి కూడా బీజేడీ .. రైల్వేలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో ఒడిశాకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బీజేపీ తరఫున రాజ్యసభ అభ్యర్ధుగా అవకాశం దక్కిన వారిలో గుజరాత్ నుంచి జేపీ నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్, మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్ వంటి వారు ఉన్నారు.












Click it and Unblock the Notifications