బిజెపియే 'కీ': ఈ షరతులకు కేంద్రం ఓకే చెప్పాల్సిందే!

న్యూఢిల్లీ: సీమాంధ్ర రాజధానిని ఎక్కడ నిర్మిస్తారన్న విషయాన్ని త్వరలోనే ప్రకటించేందుకు, కొత్త రాజధానిలో సౌకర్యాల కల్పనకు పదివేల కోట్లు ఓట్ ఆన్ అకౌంట్‌లో కేటాయించాలని బిజెపి అధిష్టానం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిందట. తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తే తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతిస్తామని ఆ పార్టీ కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. లోక్‌సభలో బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు షిండే, కమల్ నాథ్, జైరాం రమేష్ సోమవారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, సుష్మా, అరుణ్ జైట్లీలతో చర్చలు జరిపారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనిగానీ, కర్నూలు, అనంతపురం జిల్లాలతో రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గానీ తాము కోరటం లేదని బిజెపి నేతలు తెలిపారు. సీమాంధ్రకు అన్నివిధాలా న్యాయం చేయాలన్న తమ డిమాండ్‌ను ఆమోదిస్తే బిల్లుకు సహకరిస్తామని లేకుంటే మద్దతు ఉండదని చెప్పారట. పోలవరం ప్రాజెక్టును బహుళార్ద సాధక ప్రాజెక్టుగా ప్రకటించాలని, ముంపునకు గురయ్యే గ్రామాలను సీమాంధ్రకే కేటాయించాలని, భద్రాచలం డివిజన్‌ను తూర్పుగోదావరికి బదిలీ చేయాలన్నారు.

BJP demands for Telangna Draft Bill

గతంలో విశాఖపట్నానికి మంజూరు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని బిజెపి సూచించింది. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, కడపలో బ్రాహ్మణి స్టీల్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సేయిల్ లేదా విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యానికి అప్పగించి కర్మాగారాన్ని నిర్మించాలని కోరారు. విజయవాడ, తిరుపతి, విశాఖ విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా కల్పించాలన్నారు.

విశాఖ విమానాశ్రయాన్ని రక్షణ శాఖ ఆధీనం నుండి తప్పించి పౌర విమానయాన శాఖకు అప్పగించాలి. నిమ్స్, ఎయిమ్స్ తరహాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో వైద్యశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని బిజెపి కోరింది. కొత్త రాజధాని ఏర్పడి అన్ని సదుపాయాలు నెలకొనేంత వరకు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడు కొనసాగుతున్న రిజర్వేషన్లు కొనసాగించాలని కోరారు.

విభజన నాటికి హైదరాబాద్‌లో పదవీ విరమణ చేసే సీమాంధ్ర ఉద్యోగులకు పింఛన్లను భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కీలక ప్రాజెక్టులకు, పథకాలకు కేంద్రమే సీమాంధ్రకు నిధులు కేటాయించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

ఇంకా బిజెపి పలు డిమాండ్లు కేంద్రం ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. తొలి ఏడాదిలో సీమాంధ్ర ఉద్యోగుల జీతాలు, పించన్లు, వడ్డీ భారాన్ని భరించడం కష్టం. ఈ మొత్తాన్ని కేంద్రమే భరించాలి. ఎందుకంటే విభజనను సీమాంధ్ర కోరడం లేదు. ఆదాయాలపై, రాష్ట్ర సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఆదాయాలపై వివరణ ఇవ్వాలి. వ్యాట్ వసూళ్లు కోస్తాంధ్రలో రూ. 5567 కోట్లు, రాయలసీమలో రూ. 1,117 కోట్లు కాగా కేవలం హైదరాబాద్‌లోనే రూ. 31,943 కోట్లుంది.

మిగతా తెలంగాణలో రూ. 3,433 కోట్లున్నాయి. మొత్తం వ్యాట్ వసూళ్లలో హైదరాబాద్ నగరం నుంచే 76 శాతం వస్తోంది. ఈ మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు సీమాంధ్రకు కేంద్రం నిధులు మంజూరు చేయాలి. కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, భద్రాచలాన్ని తొలుత సీమాంధ్రలో చేర్చాలని కేబినెట్ నిర్ణయించింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులో ఈ ప్రస్తావన లేదు.

పోలవరానికి తెలంగాణ అంగీకరించినట్లేనని తొలుత పేర్కొని, బిల్లులో ప్రస్తావించలేదు. మళ్లీ బిల్లులో చేర్చాలి. హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగోడు, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటి పంపిణీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను కేబినెట్ అంగీకరించినా బిల్లులో పేర్కొనలేదు. దీన్ని మళ్లీ బిల్లులో చేర్చాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ప్రకటించలేదు.

ప్రధాన ప్రభుత్వ రంగ పారిశ్రామిక సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. సీమాంధ్రలో అలాంటివేవీ లేవు. పెట్రోలియం యూనివర్సిటీ, జాతీయ విపత్తు నిర్వహణా సంస్థను సీమాంధ్రలోనే పెడుతున్న విషయాన్ని బిల్లులో చేర్చాలి. కడపలో సమగ్ర ఉక్కు ప్లాంట్‌ను, విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలికి మెట్రో రైలు సదుపాయాన్ని ఐదేళ్లలో ఏర్పా టు చేసేలా బిల్లులో పేర్కొనాలి.

సీమాంధ్రలో ఆరు నెలల్లోనే ఐవోసీ, హెచ్‌పీసీఎల్ రిఫైనరీలను, ఐదేళ్లలో విశాఖ-చెన్నై కారిడార్, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలి. వెంటనే కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదనలన్నింటికీ ప్రణాళికా సంఘం అనుమతులిచ్చి, నిధుల కేటాయింపును బిల్లులో పేర్కొనాలి. వివాదాలు లేకుండా ఉండేందుకు కొత్త రాజధానిని, ప్రత్యేక కేటాయింపులను బిల్లులో స్పష్టం చేయాలి.

తెలంగాణలో 50 లక్షల మంది సీమాంధ్ర ప్రజలు నివసిస్తున్నారు. వారిలో సగం మంది హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్నారు. వారి భద్రత, రక్షణ, సంక్షేమం కోసం రాజ్యాంగపరమైన ఏర్పాట్లు చేయాలి. ఆర్టికల్ 3 ప్రకారం సరిహద్దులు మార్చవచ్చు కానీ గవర్నర్ అధికారాలను మార్చలేరు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు శాంతి భద్రతల బాధ్యతలు కల్పించడం న్యాయస్థానాల్లో చెల్లదు.

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలంటే బిజెపి మద్దతు కీలకం కావటంతో, ఆ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే బిజెపి సీమాంధ్ర ప్రయోజనాల కోసం పలు షరతులు కేంద్రం ముందు ఉంచినప్పటికీ కేంద్రం అంగీకరించకున్నా అంగీకరించకపోయినా బిల్లుకు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. షరతులు వారి వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. తమ షరతులకు అంగీకరించకుంటే తాము బిల్లుకు మద్దతిస్తూనే తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+