బెంగాల్లో బీజేపీకి ఊహించని కొత్త ప్రత్యర్థి? టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ బలహీనపడ్డ వేళ..!
పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. ముఖ్యంగా గతంలో తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్ బలహీనపడటంతో వరుసగా మూడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఓటమితో పూర్తిగా పతనమైంది. ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. అదే సమయంలో తృణమూల్ ను చిత్తు చేసి సంచలనం సృష్టించిన బీజేపీకి (BJP) ఇక అంతా నల్లేరుపై నడకే అని అంతా భావిస్తున్న వేళ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త ప్రత్యర్థి పుట్టుకురావడంతో పాటు పెను సవాల్ విసురుతోంది.

బెంగాల్లో నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి ఇప్పట్లో తిరుగులేదని అంతా భావిస్తున్న వేళ స్వయంకృతాలే సీఎం సువేందు అధికారికి శాపంగా మారిపోతున్నాయి. ఉత్తరాదిలో బీజేపీ బలపడేందుకు పనికొచ్చిన కొన్ని కారణాలు, ఇప్పుడు సువేందుకు బెంగాల్లో బలహీనపడేందుకు కారణంగా మారిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది మాంసాహారం. బెంగాలీలకు ఎంతో ఇష్టమైన మాంసాహారాన్ని సనాతన ధర్మం పేరు చెప్పి వారికి దూరం చేసేందుకు సువేందు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు బ్యాక్ పైర్ అవుతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో గుడ్లను పూర్తిగా తొలగించి, ఇస్కాన్ సహకారంతో కేవలం శాకాహార భోజనాన్ని మాత్రమే పిల్లలకు అందించాలని సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారాన్నే లేపింది. చివరకు తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రభుత్వం వారానికి రెండు రోజులు విడిగా గుడ్లు సరఫరా చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది.
ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి సువేందు తీసుకొచ్చిన బాగేశ్వర్ బాబా పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి .. నవరాత్రుల వేళ మాంసాహారం తినడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు సాధారణ బెంగాలీలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం మెడకు చుట్టుకున్నాయి. అసలే బెంగాల్ చరిత్రలో ఆహారపు అలవాట్లు అనేవి కేవలం రుచికి సంబంధినవి కాకుండా, అక్కడి సంస్కృతి, సామాజిక జీవన విధానంలో విడదీయరాని భాగంగా ఉన్నాయి. దుర్గాపూజ సమయంలో రకరకాల రుచికరమైన మాంసాహార వంటకాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రజలకు ఒక మతపరమైన ఆచారం కూడా. అయితే ఈ మధ్య కాలంలో వీహెచ్‌పీతో పాటు బాగేశ్వర్ బాబా చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు టార్గెట్ అవుతోంది. నవరాత్రుల పేరుతో తమ ఆహారపు అలవాట్లను తక్కువ చేసి మాట్లాడటం తమ ప్రాచీన సంస్కృతిని అవమానించడమేనని స్థానికులు బలంగా భావిస్తున్నారు. ఈ అలజడి క్రమంగా అధికార బీజేపీ ప్రయోజనాలకు గండికొట్టేలా కనిపిస్తోంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వీటి ప్రభావం బీజేపీపై పడేలా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications
