ముస్లిం మహిళా ఐపీఎస్ పై సువేందు వేటు..! ఇస్లాం పదాల వాడకంపై- రాజకీయ దుమారం..!
పశ్చిమబెంగాల్లో బీజేపీ అధిష్టానం కోరుకుంటున్న విధంగా హిందూత్వ రాజకీయాల్ని అమలు చేసేందుకు సీఎం సువేందు అధికారి చేస్తున్న ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా బెంగాలీలు దుర్గా పూజ సందర్బంగా నాన్ వెజ్ తినకూడదంటూ మధ్యప్రదేశ్ నుంచి బాగేశ్వర్ బాబాను తీసుకొచ్చి ప్రజలకు చెప్పించి, నాన్ వెజ్ వంటకాల్ని గుళ్లలో నిషేధించేందుకు ప్రయత్నించిన సువేందు.. ఆ తర్వాత ప్రజా వ్యతిరేకత కారణంగా నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో పాటు స్వయంగా తానే గుడికి వెళ్లి అదే చేపల కూర తినాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ వీడియోలో ఇస్లాం పదాలు వాడిన కారణంగా మహిళా ఐపీఎస్ పై వేటు వేయడం వివాదాస్పదంగా మారింది.
ఖరగ్ పూర్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ బుష్రా బాను (Bushra Bano)ను నాలుగో బెటాలియన్ డిప్యూటీ సీఓగా బదిలీ చేస్తూ సువేందు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సాధారణ బదిలీ కాదు. ఆమె తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియోలో తన ప్రసంగాన్ని "అస్సలాము అలైకుమ్" (మీకు శాంతి కలుగుగాక)తో ప్రారంభించి, మాట్లాడుతూ "ఇన్షాఅల్లాహ్"(దేవుని చిత్తమైతే)ను ఉపయోగించి, "జజాకల్లాహ్" (దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చుగాక)తో ముగించారు. ఆమె తన వీడియలో ఇస్లామిక్ పలకరింపులను ఉపయోగించినందుకు హిందుత్వ వర్గాలు టార్గెట్ చేస్తూ దీన్ని యూపీఎస్సీ జిహాద్ అంటూ విమర్శలు ప్రారంభించాయి. వీటికి స్పందిస్తూ సువేందు సర్కార్ ఆమెను బదిలీ చేసింది.

గతంలో సౌదీ అరేబియాలో పనిచేసిన బానో.. ఆ తర్వతా భారత్ కు తిరిగి వచ్చి యూపీఎస్సీ పరీక్షలో రెండుసార్లు ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం ఐపీఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు. ఈ వీడియో ప్రచారంలోకి వచ్చిన తర్వాత, హిందుత్వ అనుబంధ సోషల్ మీడియా అకౌంట్లలో ఆమె "వందేమాతరం" లేదా "జై హింద్" వంటి పదాలను వాడలేదని ఆరోపిస్తూ టార్గెట్ చేశాయి. ఇదే క్రమంలో హిందూ లీగల్ ఫండ్ అనే వెబ్‌సైట్.. ఐపీఎస్ అధికారిణి బుష్రా బానోపై బెంగాల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేసింది. దీంతో బుష్రా బానుపై బదిలీ వేటు వేశారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి.
Some social media accounts, including The Jaipur Dialogues and the Hindu Legal Fund, criticised the Muslim IPS officer for saying “Assalamualaikum” — “peace be unto you” — “Inshallah” — “God willing” — and “Jazakallah” — “may God reward you”.
— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) September 15, 2026
And now she has been punitively… https://t.co/atfc6ODj3o
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ముస్లిం దేశాధినేతలకు ప్రత్యేక ప్రార్ధనా గదిని ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో కేవలం ఇస్లాం పదాలు వాడిందని ఓ మహిళా అధికారిని టార్గెట్ చేయడమేంటని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నించారు. ఆమెకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడీ కూడా ప్రభుత్వం ఆమెకు అండగా నిలబడటానికి బదులుగా, మరుసటి రోజే బదిలీ చేసిందని విమర్శించారు. మోదీ జీ మీరు ఎలాంటి దేశాన్ని నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.ఐపీఎస్ అసోసియేషన్‌ను ట్యాగ్ చేసి మీరు ఇది చూస్తున్నారా అని అడిగారు.














Click it and Unblock the Notifications
