హిమాచల్, కర్నాటక పాఠాలు-మధ్యప్రదేశ్ లో సీనియర్లను తప్పుకునేలా బుజ్జగిస్తున్న బీజేపీ..
కర్నాటకలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద గుణపాఠంగా మారుతున్నాయి. పార్టీలో సీనియర్లను ప్రోత్సహిస్తూ జూనియర్లను పట్టించుకోని కాషాయ పార్టీకి ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. దీంతో ఎన్నికలకు కొద్ది రోజులకు ముందు జూనియర్లకు టికెట్లు ఇస్తే సీనియర్లు పార్టీని కాదని కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఈ పాఠాల్ని అమలు చేస్తోంది.
మధ్యప్రదేశ్ లో ఇప్పుడు బీజేపీయే అధికారంలో ఉంది. అయితే పార్టీలో ఉన్న సీనియర్లను కాదని పలువురు జూనియర్లను, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించాలనే ఉద్దేశం బీజేపీలో కనిపిస్తోంది. అయితే ఇందుకు సీనియర్లు ససేమిరా అనేలా ఉన్నారు. దీంతో ఇప్పుడు వారిని ఇప్పటినుంచే బుజ్జగించేందుకు పార్టీ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటుచేసి సీనియర్లను ముందుగానే తప్పుకోవాలని కోరుతోంది.

గత వారం 14 మంది రాష్ట్ర, కేంద్ర బిజెపి నాయకుల ప్రతినిధి బృందం మధ్యప్రదేశ్ అంతా పర్యటించి పార్టీ సీనియర్ల సమస్యలు పరిష్కరించి వారిని పార్టీ ప్రయోజనాల కోసం పని చేసేలా ఒప్పించింది. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున, టిక్కెట్ల పంపిణీ ప్రక్రియలో తిరుగుబాట్లు లేకుండా చూసుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపట్టింది. తాజాగా పార్టీ ఓడిన హిమాచల్ తో పాటు ప్రస్తుతం ఎన్నికలకు వెళ్తున్న కర్నాటకలో ఎదురైన పరిస్ధితులు ఇక్కడ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సహా మధ్యప్రదేశ్ బీజేపీ ప్రధాన బృందం సమావేశమై తమ మిషన్ లో ప్రతినిధులకు అందిన అభిప్రాయాల్ని చర్చించింది.
కానీ పార్టీలో యువతరానికి అవకాశం కల్పించి తాము తప్పుకునేందుకు సీనియర్లు ఇష్టపడకపోవడం బీజేపీకి చికాకు తెప్పిస్తోంది. దీంతో సాధ్యమైనంత వరకూ వారిని బుజ్జగించి చూడాలని, లేకుంటే వేటు వేసి మరీ జూనియర్లకు టికెట్లు ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే దాని ప్రభావం కూడా ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్నారు. అసలే విపక్ష కాంగ్రెస్ బీజేపీ సీనియర్లను, రెబెల్స్ ను ఆహ్వానించేందుకు కాసుకుని కూర్చుంది.












Click it and Unblock the Notifications