రూ.41 వేల టీ షర్ట్: రాహుల్ ధరించడంపై బీజేపీ భగ్గు, కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
భారత్ జోడో యత్రను యువ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన యాత్ర కొనసాగుతోండగా.. రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్‌పై రగడ నెలకొంది. దాని ధర రూ.40 వేలకు పైగా ఉండటంతో.. అంతా కాస్ట్లీ డ్రెస్ ధరించి పేదరికం, సమస్యల గురించి రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

టీ షర్ట్ ధరపై రగడ..
రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధరపై రగడ మొదలైంది. బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందిన టీ షర్ట్.. 41 వేల 257 రూపాయలు. ఇదీ ధరించి రాహుల్ పాదయాత్ర చేస్తున్నాడని, అదే టీ షర్ట్‌తో ఆయన తిరునల్వేలిలో మీడియాతో మాట్లాడారని బీజేపీ ఆరోపించింది. ఖరీదైన దుస్తులు ధరించి రాహుల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి మాట్లాడుతారా అని బీజేపీ సెటైర్లు వేసింది. ఖరీదైన దుస్తులు ధరించే నాయకుడికి నిరుపేదల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నిస్తోంది. యాత్ర కోసం రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉపయోగిస్తున్న కంటైనర్లు కూడా విలాసవంతంగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది.

నష్టం భర్తీ
రాహుల్ గాంధీ తిరునల్వేలిలో మీడియాతో మాట్లాడారు. ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకునేందుకు యాత్ర చేపడుతున్నానని చెప్పారు. బీజేపీ-ఆరెస్సెస్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం దేశవ్యాప్తంగా యాత్రను నిర్వహిస్తున్నానని తెలిపారు. దేశంలో అన్ని వ్యవస్థలు ఇప్పుడు బీజేపీ నియంత్రణలో ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నాయని ఆరోపించారు.

దేశం గురించి అవగాహన
కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు జరుగుతున్న భారత్ జోడో యాత్రకు తాను నాయకత్వం వహించడం లేదన్నారు. తాను కేవలం ఈ యాత్రలో పాల్గొంటున్నానని చెప్పారు. యాత్ర వల్ల తన గురించి, దేశం గురించి కొంత అవగాహన చేసుకుంటానని వివరించారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగనుంది. ఇటు బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. భారత్ జోడో యాత్రకు వస్తోన్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేక బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారని కాంగ్రెస్ తెలిపింది.












Click it and Unblock the Notifications