యూపీలో బీజేపీ జయకేతనం.. 16 మేయర్ స్థానాల్లో 14 బీజేపీ ఖాతాలోకి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోరపరాభవం తప్పలేదు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసిన బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన హావా కొనసాగించింది.
నవంబరు 22, 26 న రెండు దశల్లోనూ సుమారు 52.5 శాతం ఓటింగ్, నవంబరు 29 న జరిగిన పోలింగ్‌లో 53 శాతం ఓటింగ్ నమోదైంది. యూపీలోని 652 పురపాలక స్థానాల్లో 16 నగరపాలక సంస్థలు, 198 పురపాలక పరిషత్‌లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి.

మొత్తంమ్మీద యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం పదహారు నగరపాలక కార్పొరేషన్లలో పధ్నాలుగు చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ కంచుకోట రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గమైన అమేధిలోనూ ఈసారి కాషాయ జెండా రెపరెపలాడింది.
బహుజన సమాజ్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందగా, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ అసలు ఖాతాలే తెరవలేదు. లక్నో, ఫిరోజాబాద్, అమేధీ, అలహాబాద్, అయోధ్య, కాన్పూర్, షహరాన్‌పూర్, ఘజియాబాద్, గోరఖ్‌పూర్, బృందావన్-మథుర, రాయ్‌బరేలి, మొరాదాబాద్, ఝాన్సీ, వారణాసి నగరపాలక సంస్థలను బీజేపీ గెలుపొందగా, అలీగఢ్, మీరట్ నగరపాలక సంస్థలను బీఎస్పీ గెలుచుకుంది.
కాషాయదళం సాధించిన ఘన విజయంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు, గుజరాత్‌లో బీజేపీని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోన్న పార్టీలు, ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయాని, అమేధీలోనూ ఆ పార్టీకి ఓటమి తప్పలేదని యోగి వ్యాఖ్యానించారు.
2012 ఎన్నికల్లో బీజేపీ 12 నగరపాలక సంస్థలను గెలుచుకుంది. అభివృద్ధి పేరుతో ఓటర్లను కట్టడి చేసి, రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేశాయని యోగి విమర్శించారు.












Click it and Unblock the Notifications