త్రిపుర పోరు ఆసక్తికరం- ప్రత్యేక తిప్రాల్యాండ్ డిమాండ్ కు బీజేపీ నో-ఒంటరి పోరుకు రెడీ
ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర అసెంబ్లీకి తర్వలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇవాళ మిత్రపక్ష కూటమి తిప్రా మోతాతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కాషాయ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
అగర్తల : ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 16న జరిగే ఎన్నికలకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడంతో పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు సర్కార్ ను గద్దె దింపేందుకు స్ధానిక పార్టీలసాయం తీసుకున్న బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అయితే మారిన పరిస్ధితుల్లో తిప్రా మోతాతో చర్చలు జరిపిన బీజేపీ వారి డిమాండ్లకు అంగీకరించలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి.
ప్రత్యేక టిప్రాలాండ్ డిమాండ్ వినిపిస్తున్న తిప్రా మోతా కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే ప్రత్యేక టిప్రాలాండ్ డిమాండ్ కు బీజేపీ అంగీకరించలేదు. అలాగే రాతపూర్వకంగా దీనిపై ఎలాంటి హామీ ఇచ్చేందుకు అంగీకరించలేదని, దీంతో తాము ఒంటరి పోరుకు సిద్ధమైనట్లు తిప్రా మోతా నేతలు తెలిపారు. ప్రత్యేక టిప్రాలాండ్ డిమాండ్ కు రాతపూర్వకంగా అంగీకరిస్తే తప్ప కూటమికి సిద్ధంగా లేమని నేతలు వెల్లడించారు.

గతంలో కాంగ్రెస్ తో మిత్రపక్షంగా ఉన్న తిప్రా మోతా ఛీఫ్ దేవ్ వర్మ.. అనంతరం సీఏఏ ఆందోళనల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తిప్రా మోతా స్ధాపించారు. ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా తిప్రాలాండ్ డిమాండ్ నేపథ్యంలో కుదరలేదు. మరోవైపు కాంగ్రెస్-కమ్యూనిస్టుల నుంచి కూడా దేవ్ వర్మకు ఆహ్వానాలు ఉన్నా.. రాతపూర్వకంగా తమ డిమాండ్ కు అంగీకరిస్తేనే పొత్తు ఉంటుందని తేల్చిచెప్పేస్తున్నారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో కనీసం 20 గిరిజన సీట్లలో ప్రాబల్యమున్న తిప్రా మోతా బీజేపీతో జట్టు కట్టకపోతే మాత్రం ఆ పార్టీకి తీవ్ర నష్టం తప్పేలా లేదు. ఈ 20 సీట్లు గెల్చుకుని సత్తా చాటుకోవాలని తిప్రా మోతా భావిస్తోంది.












Click it and Unblock the Notifications