సర్వే: అసెంబ్లీ పోల్స్ బిజెపి హవా, కాంగ్రెసుకు దెబ్బ
న్యూఢిల్లీ: వచ్చే శానససభ ఎన్నికల్లో బిజెపి హవానే కొనసాగుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. బిజెపి వచ్చే శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే చానెళ్లు వేర్వేరుగా నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో తిరిగి బిజెపి అధికారాన్ని సాధిస్తుందని తేలింది. రాజస్థాన్‌లో కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగులుతుందని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెసును ఓడించి బిజెపి రాజస్థాన్‌లో అధికారంలోకి వస్తుందని సర్వేల్లో తేలింది.
ఢిల్లీలో నువ్వా నేనా..
ఢిల్లీలో మాత్రం నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంటుందని సర్వేల్లో తేలింది. హంగ్ అసెంబ్లీకి ఢిల్లీలో అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ ఏడు సీట్లలో విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది. ఢిల్లీలో బిజెపి 30 సీట్లను సాధిస్తుందని, మెజారిటీకి ఆరు సీట్లు తక్కువ పడుతాయని సర్వే అంచనా వేసింది. కాంగ్రెసు 29 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది.

మధ్యప్రదేశ్‌లో మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ శానససభలో 230 సీట్లు ఉండగా, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. బిజెపికి 130 సీట్లు వస్తాయని అంచనా. గత ఎన్నికల్లో బిజెపి 143 సీట్లు గెలుచుకుంది. అంటే, 13 సీట్లు తక్కువగా వస్తాయని సర్వేలో తేలింది. కాంగ్రెసు సీట్లు 71 నుంచి 84 పెరుగుతాయని అంచనా.
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ అవుట్
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం అధికారం కోల్పోతుందని సర్వేలో తేలింది. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లున్నాయి. వీటిలో కాంగ్రెసు 64 నుంచి 79 సీట్లు మాత్రమే సాధిస్తుందని అంచనా. కాగా, బిజెపి 97 నుంచి 118 సీట్ల వరకు సాధిస్తుందని సర్వేలో తేలింది. దీంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
చత్తీస్‌గడ్‌లో మళ్లీ బిజెపి..
చత్తీస్‌గడ్ రాష్ట్రంలో మళ్లీ రమణ్ సింగ్ నేతృత్వంలోని బిజెపి అధికారాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. 90 సీట్లున్న అసెంబ్లీలో బిజెపికి 47 సీట్ల దాకా దక్కనున్నాయి. ప్రస్తుతం బిజెపికి 50 స్థానాలున్నాయి. కాంగ్రెసు స్థానాలు 38 నుంచి 40కి పెరిగే అవకాశం ఉంది.
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీకి 50 శాతం మందికి పైగా మద్దతు తెలుపుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications