నిన్న యూపీ..నేడు బెంగాల్! మరో బీజేపీ కార్యకర్త కాల్చివేత
కోల్‌కత: భారతీయ జనతాపార్టీకి చెందిన క్రియాశీలక కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటనకు సంబంధించిన ప్రకంపనలు సద్దు మణగక ముందే మరో ఘాతుకం చోటు చేసుకుంది. బీజేపీకే చెందిన ఓ కార్యకర్త దారుణంగా హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ని కాల్చి చంపారు. పశ్చిమ బెంగాల్ 24 పరగణా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి పేరు చందన్ షా. జిల్లాలోని భటపారాకు చెందిన బీజేపీ కార్యకర్త.
చందన్ షా భటపారాలోని కంకినారా సతాదళ్ మైదానంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బైక్‌పై వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందన్ షా అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ కారణాల వల్లే చందన్ షాపై కాల్పులు జరిపినట్లు కుటుంబీకులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పశ్చిమ బెంగాల్ పోలీసులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. చందన్ షా హత్యోదంతం అనంతరం భటపారాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదనపు బలగాలను మోహరింపజేశారు. బాధితులు ప్రతి దాడులకు దిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీలో సురేంద్ర సింగ్ అనే బీజేపీ కార్యకర్త కూడా ఇదే తరహాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకుని 48 గంటలు కూడా గడవక ముందే- పశ్చిమ బెంగాల్‌లో అదే పార్టీకి చెందిన కార్యకర్త కాల్చివేతకు గురి కావడం ప్రకంపనలు రేపుతోంది.












Click it and Unblock the Notifications