బోడో మిలిటెంట్స్ చెర నుండి అంకన్ రావు విడుదల
డిస్పూర్: బోడో తీవ్రవాదుల చెర నుంచి ఆంధ్రా ఇంజనీర్ అంకన్ రావుకు విముక్తి లభించింది. కిడ్నాప్ చేసిన చోటే చంపాగుడి వద్ద అంకన్ రావును తీవ్రవాదులు వదిలి వెళ్లారు. అతని విడుదలతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన బోడో మిలిటెంట్లు అంకన్ రావును కిడ్నాప్ చేశారు.
ప్రకాశం జిల్లా చీరాల మండలంకు చెందిన అంకన్ రావు.. బొల్లినేని శ్రీనయ్య అండ్ కంపెనీలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనిని బోడో మిలిటెంట్స్ దాదాపు పది రోజుల క్రితం అంటే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అపహరించారు. అతను బోడో తీవ్రవాదుల నుండి విడుదలైన అనంతరం తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన క్షేమసమాచారాలు తెలియజేశారు.

కాగా, బోడో మిలిటెంట్స్ గతంలో పైడి రాజు అనే తెలుగు ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. అసోంలోనే అపహరణకు గురైన ఆంధ్రా ఇంజనీర్ పైడిరాజును బోడో రెబల్ తీవ్రవాదాలు ఫిబ్రవరి 27న రాత్రి విడుదల చేశారు.
అంతకుముందు పది రోజుల క్రితం ఆయనను బోడో రెబల్స్ కిడ్నాప్ చేశారు. పైడి రాజును అపహరించిన బోడో తీవ్రవాదులు ఐదు కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అపహరణ విషయం తెలుసుకున్న అస్సాం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పైడిరాజుకు విముక్తి కలిగింది.












Click it and Unblock the Notifications