ఉగ్రవాదుల కుట్రేనా?: ఫ్లాట్‌లో బాంబు పేలుడు, తప్పిన ప్రమాదం
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని బహదూర్‌పూర్‌లో ఓ ప్లాట్‌లో సోమవారం రాత్రి బాంబు పేలింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలానికి పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకుని నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.
2013లో నరేంద్ర మోడీ.. గాంధీ మైదానంలో ప్రచారం నిర్వహించిన సమయంలో, బోధ్ గయాలో పేలిన బాంబులతో ఈ బాంబులకు పోలిక ఉన్నాయని, అదే మెటీరియల్ ఈ బాంబులలో ఉపయోగించారని పోలీసులు తెలిపారు.
కాగా, ఘటనా స్థలంలో లభించిన రెండు బాంబులను నిర్వీర్యం చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి జితేంద్ర రాణా తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. బాంబు పేలుడు ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని ఆయన తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బాంబు పేలిన ఫ్లాట్‌లో నలందాకు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్నారని స్థానికులు చెప్పారు. పోలీసులు వస్తున్నారని తెలియడంతోనే వారు పరారయ్యరని తెలిపారు.
ఈ పేలుడు పదార్థాలు ఎవరైనా దుండగులు తయారు చేశారా? లేక ఉగ్రవాదులే పేలుళ్లు జరపాలనే ఉద్దేశంతో బాంబులను తయారు చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పేలుడు ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.












Click it and Unblock the Notifications