
Video: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి: సీపీఎం పనేనంటూ ఆరోపణలు
తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ జిల్లాలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. పయ్యనుర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని, అయితే, ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసుల తెలిపారు.
ఈ దాడిలో ఆర్ఎస్ఎస్ కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ నేతలు ఈ దాడికి పాల్పడింది సీపీఎం గూండాలేననని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించడం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఈ దాడి వెనుక అధికార సీపీఎం ఉందని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది. పయ్యనుర్ సీపీఎం నాయకుడు ధన్‌రాజ్ వర్ధంతి నేపథ్యంలో ఈ దాడి జరిగింది. అతడి మరణం వెనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
#WATCH केरल: कन्नूर जिले के पय्यानुर में RSS कार्यालय पर बम फेंका गया। पय्यान्नूर पुलिस के अनुसार घटना आज सुबह हुई है। घटना में इमारत की खिड़की के शीशे टूटे। pic.twitter.com/Ii2uQRDif1
— ANI_HindiNews (@AHindinews) July 12, 2022
ఇది ఇలావుండగా, జూన్ 30న కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వయనాడ్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం గమనార్హం.

జూన్ 30 రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.