ఢిల్లీ జమ్ముతావి రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు
దేశంలో రైళ్లకు బాంబు బెదిరింపులు నిత్య కృత్యంగా మారుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతీ నెలలో బాంబు బెదిరింపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ జమ్ముతావి రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. న్యూఢిల్లీ జమ్ముతావి రాజధాని ఎక్స్ప్రెస్ కు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ రావడంతో హర్యానాలో రైలును నిలిపివేశారు.
హర్యానాలోని సోనిపట్ వద్ద రాత్రి 9:30 నిమిషాలకు రైలును ఆపిన అధికారులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిప్పర్ డాగ్స్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్ధారించారు. అంబులెన్స్, అగ్నిమాపక దళం, గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు.

రైలులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రైల్వే అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వకుండా నాలుగు గంటలపాటు రైలును ఆపివేయడం పైన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా రైలు గంటల పాటు నిలిచిపోయిందని ప్రయాణికులు దీనిపై అధికారులు ఎవరు సమాధానం చెప్పడం లేదని ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే మొత్తం నాలుగు గంటలపాటు రైలు సోనిపట్ లోనే ఉండిపోయింది.
ఇక తనిఖీల తర్వాత అర్ధరాత్రి 1:30 నిమిషాలకు తిరిగి రైలు బయలుదేరి వెళ్ళింది. గత నెలలో పానిపట్టు రోహ్తక్ ప్యాసింజర్ రైల్లో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో రైలును గొహన రైల్వేస్టేషన్లో ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరో ఫేక్ కాల్ చేయడం వల్ల రైలును ఆపిన రైల్వే అధికారులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిప్పర్ డాగ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అప్పుడు కూడా రైలులో ఎటువంటి ప్రమాదకరమైన, అనుమానాస్పదమైన వస్తువులు కనిపించకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications