21 ఏళ్ల యువతి ధైర్యం: ఐదుగురు దొంగల్ని కత్తితో వెంబడించింది
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 21 ఏళ్ల ఓ యువతి ధైర్యం ప్రదర్శించింది. తన ఇంటికి దొంగతనానికి వచ్చిన ఐదుగురిని కత్తితో వెంటపడి.. దొంగతనం జరగకుండా అడ్డుకుంది. ఆమె ధైర్యసాహసాలు విన్న మధ్యప్రదేశ్ హోమంత్రి బాబులాల్ గౌర్ గురువారం నాడు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను బ్రేవరీ అవార్డు కోసం రికమండ్ చేస్తామని చెప్పారు.
ఆ యువతి పేరు చరణ్ ప్రీత్ కౌర్ (21). ఆమె ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతోంది. పరీక్షల కోసం ఆమె ప్రిపేర్ అవుతోంది. బుధవారం నాడు ఉదయం అన్సాల్ ప్రధాన్ ఎన్‌క్లేవ్‌లోని తమ ఇంటి రెండో ఫ్లోర్లో ఆమె చదువుకుంటోంది. ఆ సమయంలో ఆమెకు ఏవో ధ్వనులు వినిపించాయి.

ఆమె కిందకు చూసింది. మాస్కులు ధరించిన వారు, ఆమె ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఫస్ట్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్నారు. ఆమెకు కొద్ది దూరంలో నాలుగు ఫీట్ల కత్తి కనిపించింది. దానిని దొంగలకు చూపిస్తూ అరిచింది. కత్తితో కిందకు పరుగెత్తుతూ తండ్రిని పిలిచింది.
ఆమె తండ్రి పేరు హర్వీందర్ సింగ్ ధీర్ (51). సివిల్ కాంట్రాక్టర్. అతనికి మరో కత్తి కనిపించింది. అతను కూడా ఆ కత్తి తీసుకొని బయటకు వచ్చాడు. చరణ్ ప్రీత్ సింగ్, హర్వీందర్ సింగ్ ఇద్దరి చేతుల్లో కత్తి చూసిన ఐదుగురు దొంగలు కాళ్లకు పని చెప్పారు.
బుధవారం నాడు జరిగిన విషయాన్ని హోంమంత్రి తనను కలిసేందుకు వచ్చినప్పుడు ఆ యువతి పూసగుచ్చినట్లు చెప్పింది. హోంమంత్రి ఆమెను మెచ్చుకున్నారు. ఝాన్సీకీ రాణీలా ధైర్యం ప్రదర్శించావన్నారు. యువతి పేరును బ్రేవరీ అవార్డుకు నామినేట్ చేయడంతో పాటు, తమ డిపార్టుమెంట్ తదుపరి సంచికలో ఆమె గురించి రాస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications