ఆదుకోండి: ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన హరీష్ టీ అమ్ముకుంటున్నాడు
కొద్ది రోజుల క్రితం ముగిసిన ఏషియా గేమ్స్‌లో భారత్ మంచి ప్రదర్శన కనబర్చింది. మొత్తం 69 పతకాలు సాధించిన భారత్ అందులో 15 బంగారు పతకాలున్నాయి. మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు కూడా ప్రకటించాయి. సెపక్‌త్రా కీడలో భారత్‌కు చెందిన హరీష్ కుమార్ కాంస్యం పతకం సాధించారు. ప్రఖ్యాత ఆసియాగేమ్స్‌లో పతకం అయితే దేశం తరపున సాధించాడు కానీ పేదరికంపై మాత్రం విజయం సాధించలేకపోయాడు. ఆసియా క్రీడల్లో పతకం గెలిచాక ఎప్పుడూలానే తన టీకొట్టులో టీ అమ్ముతూ కనిపించాడు. ఈ టీకొట్టు ఢిల్లీలోని మజ్ను కా టిల్లాలో ఉంది.
తన కుటుంబంలో చాలామంది సభ్యులుంటారని, ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పాడు హరీష్. అందుకే తన తండ్రికి టీకొట్టులో సహాయపడుతూ ఉంటానని చెప్పుకొచ్చాడు. రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తను ప్రాక్టీస్‌కు సమయం కేటాయిస్తానని చెప్పాడు. మిగతా సమయంలో టీ కొట్టు దగ్గర తండ్రికి సహాయం చేస్తూ ఉంటాడని చెప్పాడు. మరోవైపు తను ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఉందని చెప్పాడు హరీష్. 2011 తన కోచ్ ఈ ఆటని ఆడమని అడిగినప్పుడు సెపక్‌త్రా క్రీడ గురించి తెలుసుకున్నట్లు వెల్లడించాడు.
ఆసియా గేమ్స్: సెపక్ తక్రాలో భారత్‌కు కాంస్యం

"సెపక్‌త్రా ఆటను 2011లో ఆడటం ప్రారంభించాను. కోచ్ హేమ్‌రాజ్ ప్రోత్సాహంతోనే ఈ క్రీడను నేర్చుకున్నాను. ముందు నేను ఒక టైర్‌తో ఆడుతుండటం చూసిన హేమ్‌రాజ్... స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నెలకు సరిపడే డబ్బులతో పాటు కిట్స్ కూడా అందేవి. రోజూ ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ వేదికపై భారత్‌ను సగర్వంగా నిలుపుతాను"అని హరీష్ చెప్పాడు.
ఇక రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం హరీష్‌ది. తన కొడుకును ప్రోత్సాహించి ఇంతటి మంచి స్థానానికి తీసుకొచ్చిన ప్రభుత్వానికి హరీష్ తల్లి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వమే తన కొడుకుకు అన్ని ఖర్చులు పెట్టుకుందని తెలిపింది. ప్రాక్టీస్ సమయంలో ఆహారంతో పాటు ఉండేందుకు నివాసం ఏర్పాటు చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. నెలవారీగా కొంత డబ్బును ఇచ్చి హరీష్‌ను ఆదుకొన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సోదరుడు ధవన్ ధన్యావాదాలు తెలిపారు. తన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఇక కుటుంబంలోని కష్టాలు తొలిగిపోతాయని ధవన్ వెల్లడించాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!