200 రూపాయలు అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తిని చంపేసిన డ్రగ్ అడిక్ట్ .. యూపీలో దారుణ హత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి . ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే హత్యలకు పాల్పడుతున్న ఘటనలు యూపీలో పోలీసులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. తాజాగా రెండు వందల రూపాయల కోసం ఓ యువకుడు మరో వ్యక్తిని హతమార్చిన ఘటన అలీఘడ్ నగరంలో చోటు చేసుకుంది.

అలీఘడ్ నగరంలో దారుణం .. పంక్చర్ షాప్ నిర్వాహకుడిని హత్య చేసిన యువకుడు
అలీఘడ్ నగరంలోని సివిల్ లైన్స్ బజార్ ప్రాంతంలో రద్దీగా ఉన్న శంషాద్ మార్కెట్లో, రూ .200 అడిగితే ఇవ్వలేదని , ఓ యువకుడు 30 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం ముగ్గురు పిల్లల తండ్రి అన్సార్ అహ్మద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన షంషాద్ బజార్‌లో పంక్చర్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు . అతడు డబ్బులు అడిగితే ఇవ్వని కారణంగా ఆసిఫ్ అనే యువకుడు అతనిని హత్య చేశాడని తెలిపారు.

200 రూపాయలు అడిగితే ఇవ్వలేదని తుపాకీతో కాల్చి పరారైన నిందితుడు
పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఆసిఫ్ మోటారుసైకిల్ అడగడానికి అహ్మద్ దుకాణానికి వచ్చాడని కాని అహ్మద్ అతనికి మోటార్ సైకిల్ ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ ఆసిఫ్ అహ్మద్ ను 200 రూపాయలు అడగడానికి దుకాణానికి వచ్చాడని, అప్పుడు కూడా అహ్మద్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో జేబులో నుండి తుపాకీ తీసుకుని అహ్మద్ తల పై కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు .

డ్రగ్స్ కు బానిసై ... 200 రూపాయల కోసం హత్య .. యూపీ లో షాకింగ్ ఘటన
నిందితుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని , మాదకద్రవ్యాల మత్తులోనే హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. సంఘటన జరిగిన తరువాత ఆసిఫ్ అక్కడ ఉన్న మోటార్ సైకిల్ పై పారిపోయాడని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేవలం 200 రూపాయల కోసం హతమార్చాడా ? లేకా మరేదైనా కారణం ఉందా ? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . అయితే కేవలం 200 రూపాయలు అడిగితే ఇవ్వటానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన ఘటన యూపీ ప్రజలను షాక్ కు గురి చేస్తుంది.