ఆ వీడియో ఏంటయ్యా..?: వివరాలు కోరిన ప్రధాని కార్యాలయం
సరిహద్దు భద్రతా దళాలకు దయనీయమైన ఆహారం అందిస్తున్నారంటూ ఓ బీఎస్ఎఫ్ జవాను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియోపై చివరికి ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది.
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళాలకు దయనీయమైన ఆహారం అందిస్తున్నారంటూ ఓ బీఎస్ఎఫ్ జవాను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియోపై చివరికి ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది.
సదరు వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఈ వీడియోలు పోస్ట్ చేశాడు.
బీఎస్ఎఫ్ సిబ్బందికి అందించే ఆహారం దయనీయ పరిస్థితి కళ్ళకు కడుతున్న నాలుగు వీడియోలను అతడు తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. వీటిని దాదాపు 30 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు.

అయితే ఈ వీడియోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడన్న కోపంతో తేజ్ బహదూర్ పై బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు కక్ష సాధిస్తున్నారంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే తేజ్ బహదూర్ ను సరిహద్దు నియంత్రణ రేఖ ప్రదేశం నుంచి రాజౌరీ క్యాంపునకు బదిలీ చేశారు. దీనిపై అతడి భార్య షర్మిలా స్పందిస్తూ.. "మంచి ఆహారం అడగడం నేరం ఏమీకాదు. ఆయన అందరి కోసం అడిగారు. నా భర్త చేసింది ముమ్మాటికీ సరైన పనే.." అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications