కోడలు మృతి కేసు: ఎంపీ భార్య, కుమారుడు అరెస్ట్
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బీఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని ఆత్మహత్య కేసులో ఆయన భార్య, కుమారుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సంజయ్ నగర్‌లోని ఇంట్లో బుధవారం ఉదయం హిమాని బాత్‌రూమ్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఎంపీ కుటుంబ సభ్యులు హిమానిని వరకట్నం కోసం వేధించారని, ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కావాలని డిమాండ్ చేశారని హిమాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఘజియాబాద్ సిటీ ఎస్పీ సల్మాన్ తాజ్ వెల్లడించారు. హిమాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే... బుధవారం ఉదయం హిమాని బాత్‌రూమ్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వెంటనే ఆమెను ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను యశోదా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఆమె తలకు బుల్లెట్ గాయాలున్నాయి. అయితే ఆమెది హత్యా, ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని హిమాని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదని ఘజియాబాద్ ఎస్పీ సల్మాన్ తాజ్ పేర్కొన్నారు.
మృతురాలు ఆత్మహత్యకు ఉపయోగించిన పిస్టోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. హిమాన్షి ఎంపీ నరేంద్ర కశ్యప్ పెద్ద కుమారుడు సాగర్ కశ్యప్ భార్య. తన లైసెన్స్ పిస్టోల్‌తో కాల్చుకుని హిమాని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు విచారణలో వెల్లడించాడు.
నరేంద్ర కశ్యప్ పెద్ద కుమారుడు సంజయ్ కశ్యప్ భార్య హిమాని. మూడు సంవత్సరాల క్రితమే పెళ్లి అయిన వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. హిమాని తండ్రి హిరాలాల్ కశ్యప్ బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నరేంద్ర కశ్యప్‌పై ఐపీసీ 498A, 304B సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఆస్పత్రిలో చేరిన ఎంపీ నరేంద్ర కశ్యప్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. హిమాని మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications