వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెప్టెన్ అమరీందర్ సింగ్: ‘పాకిస్తాన్ పాలకులకు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ సన్నిహితుడు, పంజాబ్ సీఎం పదవికి ఆయన పేరును వ్యతిరేకిస్తా’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగడానికి ముందే అమరీందర్ సింగ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌‌కు రాజీనామా లేఖ ఇచ్చారు.

సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

గవర్నర్‌ను కలిసి అమరీందర్ రాజీనామా చేసినట్లు ఆయన మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ పేర్కొనట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

తన తండ్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారంటూ ఆయన కుమారుడు రనీందర్ సింగ్ ఓ ఫొటోను ట్వీట్ చేశారు.

అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్

పదవికి రాజీనామా చేయాలని ఉదయమే నిర్ణయించుకున్నానని, ఈ విషయం పార్టీ హైకమాండ్‌కు కూడా చెప్పానని రాజీనామా అనంతరం అమరీందర్ సింగ్ వెల్లడించారు.

తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని, అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

అధిష్టానం తనకు నమ్మకస్తులైన వారిని ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవచ్చని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ అన్నారు.

అయితే, పంజాబ్ ముఖ్యమంత్రిగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పేరును తాను వ్యతిరేకిస్తానని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు.

సిద్ధూ పాకిస్తాన్ పాలకులకు సన్నిహితుడని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

''రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పేరును నేను వ్యతిరేకిస్తాను. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనకు స్నేహితుడు. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో సిద్ధూకు స్నేహం ఉంది'' అని అమరీందర్ అన్నారు.

''పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఆయుధాలు, హెరాయిన్ వస్తున్నాయి. భారత దేశంపై డ్రోన్‌లను వదులుతున్నారు. అలాంటి దేశ నాయకులకు స్నేహితుడైన సిద్ధూను ముఖ్యమంత్రిని చేయడం నేను వ్యతిరేకిస్తా'' అని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.

పీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మధ్య అభిప్రాయభేదాలు

గత ఏడాది కాలంగా ప్రస్తుత పీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిని తొలగించాలని సిద్ధూ హైకమాండ్‌ను పట్టుబడుతూ వచ్చారు.

ఇటీవల హైకమాండ్ ఇరువురు నేతల మధ్య రాజీకి ప్రయత్నించినా, అది కుదిరినట్లే కుదిరి మళ్లీ మొదటికి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమావేశానికి పార్టీ హైకమాండ్ ఆదేశాలివ్వడంతో అమరీందర్ సింగ్ సీఎం పీఠం నుంచి తప్పుకోవచ్చన్న వాదనలకు బలం చేకూరింది.

శనివారం నాడు లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుందని పంజాబ్ కాంగ్రెస్ వ్యవహాహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్ శుక్రవారం ట్వీట్ చేయగా, పీసీసీ చీఫ్ సిద్ధూ దానిని రీట్వీట్ చేశారు.

సమస్య ఎప్పటి నుంచి?

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ ‌అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తోంది. సిద్ధూ బీజేపీని వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌లోకి వచ్చిన సిద్ధూకు మంత్రి పదవి దక్కింది. అయితే సీఎంతో విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు.

అమరీందర్ సింగ్‌కు ఇష్టం లేకపోయినా, కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధూకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.

కొన్నాళ్లు ఇద్దరు నేతలు దిల్లీకి వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరిందని, విభేదాలు సమసిపోయాయని ప్రచారం జరిగింది. కానీ, తాజా ఘటనల తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టమైంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Captain Amarinder Singh: ‘Navjot Singh Sidhu is close to the rulers of Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X