భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో.. 10లక్షలు చోరీ, అడ్డంగా బుక్కయింది
న్యూఢిల్లీ : ప్రియుడితో జంప్ అవడానికి సొంత ఇంటికే కన్నం పెట్టేసింది ఓ వివాహిత. ఆపై.. దోపిడీ, అత్యాచార యత్నం అంటూ పోలీసులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. అసలు దొంగ తానే అని ఒప్పుకోక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని లాహోరి గేట్ ప్రాంతంలో ఓ మహిళ (26) భర్తతో పాటు కలిసి జీవిస్తోంది. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం ముగ్గురు దుండగులు తమ ఇంట్లోకి చొరబడి 10లక్షలు ఎత్తుకెళ్లారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జుట్టు కత్తిరించి, దుస్తులను చించి, లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది మహిళ.

దర్యాప్తులో భాగంగా.. చోరీ జరిగిన ఇంటికి వెళ్లి పరిశీలించిన పోలీసులు, చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. అలాగే ఆ వీధిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు పోలీసులు. ఎక్కడా.. ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో సదరు మహిళపైనే పోలీసుల్లో అనుమానం మొదలైంది. దీంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు నిజం బయటపెట్టింది సదరు మహిళ.
దొంగతనానికి పాల్పడింది ఆమె అని పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఆమె కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు.. వేరే వ్యక్తితో ఆమెకు సంబంధమున్నట్లుగా తేల్చారు. ప్రియుడితో కలిసి 10లక్షల సొమ్ముతో పారిపోయేందుకే ఆమె ఈ ప్లాన్ వేసిందని నార్త్ డీజీపీ మధుర్ వర్మ వెల్లడించారు.












Click it and Unblock the Notifications