సినిమాలకు పాకిన సెగ: దండం పెట్టి వెళ్లిపోయిన హీరో
బెంగళూరు: కావేరి నదీ జలాల విడుదల వ్యవహారం కర్ణాటకలో పెను దుమారాన్ని రేపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5,000 క్యూసెక్కుల జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రక్షణ వేదిక ప్రతినిధులు ఇప్పటికే బెంగళూరులో బంద్ పాటించారు. శుక్రవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు.
కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదీ జలాలను విడుదల చేయడం పట్ల అటు తమిళనాడు రైతులు కూడా సంతోషంగా లేరు. 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించగా.. దీన్ని 5,000 క్యూసెక్కులకే పరిమితం చేసింది కర్ణాటక. దీన్ని వ్యతిరేకిస్తూ అటు తమిళనాడులోనూ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య ప్రముఖ తమిళనటుడు సిద్ధార్థ్.. బెంగళూరులో పర్యటించడం వివాదం రేపింది. ఆయన నటించిన తాజా చిత్రం చిత్తా ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరుకు వచ్చారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన కర్ణాటక రక్షణ వేదిక నాయకులు.. ప్రెస్ మీట్ వెన్యూకు చేరుకున్నారు. సిద్ధార్థ్‌ను అడ్డుకున్నారు.

కావేరీ నదీ జలాల పంపకాల వ్యవహారంలో కర్ణాటకకు మద్దతు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అప్పుడే చిత్తా సినిమాను కర్ణాటకలో ఆడనిస్తామంటూ హెచ్చరించారు. కర్ణాటక వేదిక ప్రతినిధులను వారించడానికి సిద్ధార్థ్ ప్రయత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఆ సమయంలో కన్నడంలో మాట్లాడారు. సినిమాలతో ముడిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఓ దండం పెట్టి బయటకి వెళ్లిపోయారు. ఇదే ప్రెస్ మీట్‌లో కర్ణాటక వేదిక ప్రతినిధులు మాట్లాడారు. తమిళ సినిమాలను ప్రోత్సహించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సరైన వర్షాలు పడనప్పటికీ- కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని అడ్డుకోవాలని, శుక్రవారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
సినిమాలకు పాకిన సెగ: దండం పెట్టి వెళ్లిపోయిన హీరో#karnataka, #TamilNadu #Bengaluru #siddharth, pic.twitter.com/ppzN1wrYVQ
— oneindiatelugu (@oneindiatelugu) September 28, 2023
ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ డ్రామా చిత్తా. సిద్ధార్థ్ సొంత బ్యానర్ ఏతకి ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఇది తెరకెక్కింది. మలయాళ నటి నిమిషా సాజయాన్ హీరోయిన్. ఇవ్వాళే విడుదలయింది. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సహస్ర శ్రీ, అంజలి నాయక్ ఇతర పాత్రలను పోషించారు.












Click it and Unblock the Notifications