కేజ్రివాల్ కొత్త ఇంట్లోకీ దూరిన సీబీఐ ! టెండర్ అక్రమాలంటూ రంగంలోకి..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూ, కేంద్రానికీ మధ్య వార్ ముదురుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోపు కేజ్రివాల్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం.. ఇవాళ ఆయన కొత్త ఇంటిని టార్గెట్ చేసింది. కేజ్రివాల్ కొత్త ఇంటి నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కోసం సీబీఐని ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం నిర్మాణంలో టెండర్ నిబంధనల ఉల్లంఘన సహా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన కొందరు అధికారులపై విచారణ ప్రారంభించినట్లు సీబీఐ ఇవాళ తెలిపింది. విచారణలో తగిన వివరాలు లభిస్తే దీనిపై సాధారణ కేసు ఆర్సీ నమోదు చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

కేజ్రివాల్ కొత్త ఇంటి భవనానికి మార్పులు చేర్పులపై పిడబ్ల్యుడి అధికారుల ఆమోదం తెలిపిన రికార్డులతో సహా పత్రాల కాపీలను ఇవ్వాలని సీబీఐ ఇవాళ ఢిల్లీ ప్రభుత్వ ప్రజా పనుల శాఖకు లేఖ రాసింది. ఏజెన్సీ బిల్డింగ్ ప్లాన్ ఆమోదానికి సంబంధించిన పత్రాలు, మార్బుల్ ఫ్లోరింగ్‌తో పాటు కాంట్రాక్టర్‌కు చెల్లింపుల వివరాలను కోరింది. వీటన్నింటిని వచ్చే మంగళవారం ఉదయం 10 గంటల కల్లా సమర్పించాలని ఆదేశించింది.
కేజ్రివాల్ ఇంటిపై సీబీఐ దర్యాప్తు చేయడాన్ని ఆయన పార్టీ ఆప్ తీవ్రంగా తప్పుబట్టింది. కేజ్రీవాల్‌జీపై ఇప్పటివరకు బీజేపీ 50కిపైగా కేసులు పెట్టిందని, వాటిలో ఏదీ బయటకు రాలేదని తెలిపింది. బీజేపీ ఎన్ని విచారణలు చేసినా అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుల ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటారని వెల్లడించింది. ప్రపంచంలోనే భారత్‌ను నంబర్ వన్‌గా చేస్తానని కేజ్రీవాల్ ప్రమాణం చేశారని, ఇందుకోసం ఎంతటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని ఆప్ తన ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications