సంచలనం... ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కామ్... లంచాధికారులపై సీబీఐ కేసు నమోదు
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు,అక్రమాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. లంచం తీసుకుని కొంతమంది అభ్యర్థులకు మెడికల్ క్లియరెన్స్ ఇచ్చారన్న ఆరోపణలతో తాజాగా ఆరుగురు లెఫ్టినెంట్ కల్నల్స్‌తో పాటు ఒక ఆర్మీ మేజర్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరితో పాటు మరో 17 మంది ఇండియన్ ఆర్మీ సిబ్బందిపై సీబీఐ కేసులు నమోదు చేయడం గమనార్హం.
సర్వీస్ సెలక్షన్ బోర్డు రిక్రూట్‌మెంట్ ద్వారా అధికారులు,ఇతర ర్యాంకులకు సంబంధించిన నియామకాల్లో ఈ 23 మంది అవకతకలు,అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. అదనపు డైరెక్టరేట్ జనరల్, డిసిప్లిన్ & విజిలెన్స్, అడ్జటెంట్ జనరల్ బ్రాంచ్, రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్మీ) ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

గత నెలలో అందిన ఆ ఫిర్యాదులో... రిక్రూట్‌మెంట్ అవకతవకల్లో కొంతమంది ఆర్మీ అధికారుల ప్రమేయం ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొందని సీబీఐ తెలిపింది. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్‌లో మెడికల్ పరీక్షల్లో క్లియరెన్స్‌కు వీరు లంచాలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారని వెల్లడించింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్‌కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్ మాస్టర్ మైండ్‌గా ఉన్నట్లుగా సీబీఐ భావిస్తోంది. సోమవారం(మార్చి 15) బేస్ హాస్పిటల్ సహా 30 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ దాడులు చేసింది. ఇందులో లక్నో,జైపూర్,గౌహతి,కపుర్తలా,బతిందా,కైతాల్,పల్వాల్,బరేలీ,గోరఖ్‌పూర్,విశాఖపట్నం, తదితర నగరాలు ఉన్నాయి. ఈ దాడుల్లో కొన్ని డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నామని... ప్రస్తుతం వాటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నామని సీబీఐ స్పష్టం చేసింది.
గతంలో పలు ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల్లో అక్రమాలు,అవకతవకల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లోనే అక్రమాలు,అవకతవకలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications