విపక్షాలపై ఆగని సీబీఐ దాడులు-బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీకి మరోసారి పిలుపు..
బీహార్లో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా చోటు చేసుకున్న ఉద్యోగాల కోసం భూముల కుంభకోణంలో ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వి కూడా ఇరుక్కున్నారు.
బీహార్లో గతంలో రైల్వే ఉద్యోగాల కోసం భూములిచ్చిన కుంభకోణంపై సీబీఐ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో పాటు అనుమానితులపైనా కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే బీహార్ వ్యాప్తంగా పలు చోట్ల ఈ కేసులో ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తుండగా.. తాజాగా సీబీఐ అధికారులు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను విచారణకు రావాలని సమన్లు పంపారు. రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ తో పాటు మరికొందరు నిందితులుగా ఉన్న ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 24 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన ఒక రోజు తర్వాత సీబీఐ ఈ సమన్లు జారీ చేసింది.
రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్ధులు భూములిచ్చిన ఈ స్కాంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి, ఆయన సహచరుల్ని ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారించింది. తేజస్వి యాదవ్ కు కూడా ఇప్పటికే సీబీఐ నోటీసు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి నోటీసు పంపారు. ఈసారి సీబీఐ విచారణకు హాజరైతే తేజస్వి స్టేట్ మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది. తండ్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ స్కాంలో తేజస్వి కూడా లబ్ది పొందారన్నది సీబీఐ అనుమానం.

బీహార్లో బీజేపీ నుంచి విడిపోయి జేడీయూ తిరిగి ఆర్జేడీతో జట్టు కట్టిన తర్వాత లాలూ కుటుంబంపై పాత కేసుల్ని దర్యాప్తు సంస్ధలు తిరగతోడుతున్నాయి. ఆయన వయోవృద్ధుడై కదల్లేని పరిస్దితుల్లో ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్ధలు ఆయనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ సీఎం, ఆయన భార్య రబ్రీదేవి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. సీబీఐ, ఈడీ చర్యలపై తేజస్వితో పాటు ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తమపై దర్యాప్తు సంస్ధల్ని ఉసిగొల్లుతోందని ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications