ఉప్పుడు బియ్యం తినడం లేదే.. ముడి బియ్యం సప్లై చేయండి: కేంద్రమంత్రి గోయల్
ఉప్పుడు బియ్యం ఇప్పుడు ఎవరు తినడం లేదని... ఏడాది కిందటే ముడి బియ్యం సప్లై చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పస్టంచేసింది. ముడి బియ్యం ఎంత ఇచ్చినా కొనేందుకు సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. తనపై, మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ పూల్ కింద ఇవ్వాల్సిన ముడి బియ్యం ఇవ్వాలని సూచించారు.

బాయిల్డ్ రైస్ నిల్వలు
నాలుగు ఏళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు ఎఫ్ సీఐ వద్ద ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో వారు ఆయనతో చర్చించారు. హుజురాబాద్ ఓటమి తర్వాత తెలంగాణ సీఎం కెసిఆర్ నిస్పృహలో ఉన్నారని ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు లేని సమస్యను సృష్టించారని విమర్శించారు. తెలంగాణ నుంచి గతం కంటే మూడు రేట్లు ఎక్కువ ధాన్యం సేకరించడం జరిగిందన్నారు.

మద్దతు ధర పెంచామే..
మద్దతు ధర అయిదు సార్లు పెంచామనే విషయాన్ని గోయల్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, గత రబీ సీజన్ లో రావాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటి వరకు సప్లై చేయలేదన్నారు. ప్రత్యేక కేసు కింద తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం సేకరణకు కొంత వెసులుబాటు ఇచ్చినట్లు చెప్పారు. రబీ కింద ఇవ్వాల్సిన 14 ఎల్ఎంటీ ఉప్పుడు బియ్యం, 13 ఎల్ఎంటీ ముడి బియ్యం వెంటనే సప్లయి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

అండ దండ..
రైతులకు కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే యాసంగిలో ముడి బియ్యం పంపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీకి టీఆర్ఎస్ మంత్రులు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ పంపమని లేఖ రాసినట్లు, ఒప్పందం ప్రకారం కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రైతులకు గోయల్ సూచించారు.












Click it and Unblock the Notifications