వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూల్స్ పాటించకుంటే మీ వాహనాలు సీజ్, క్రిమినల్ కేసులు!
హైదరాబాద్లో వాహనదారులకు బిగ్ అలర్ట్. నకిలీ ట్యాంపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్ లు ఉన్న వాహనాలను నడిపే వారికి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలను నడిపే వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలను వేగవంతం చేశారు.
ఆరు క్రిమినల్ కేసులను నమోదు చేసి వాహనాలు సీజ్
నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్న వారిపైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధించడమే కాదు, మోటార్ వాహనాల చట్టం మరియు సంబంధిత తీవ్రమైన క్రిమినల్ కేసులను నమోదు చేస్తున్నారు. తాజాగా నకిలీ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను వినియోగిస్తున్న వారిపై వారం వ్యవధిలోనే ఆరు క్రిమినల్ కేసులను నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
వాహనాల యొక్క అసలు గుర్తింపును దాచటం, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉద్దేశంతో నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్న వారిపైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో ఇప్పటివరకు ఆరు వాహనాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.
ఈ పీఎస్ లలో నకిలీ నంబర్ ప్లేట్ లపై కేసులు
సంగారెడ్డి జిల్లా హద్నూర్ పిఎస్, హైదరాబాద్ కాలా పత్తర్ పిఎస్, అఫ్జల్గంజ్ పిఎస్, వరంగల్ జిల్లా ఇంతేజార్ గంజ్ పిఎస్, కామారెడ్డి టౌన్ పిఎస్, ముషీరాబాద్ పిఎస్ లలో ఇప్పటివరకు ట్యాంపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేసి వాహనదారుల పైన క్రిమినల్ కేసులు పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్ ఎస్ ఆర్ పి నెంబర్ ప్లేట్లు తప్పనిసరి అని వెల్లడించారు.
వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్లు మాత్రమే
ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు మాత్రమే వాహనాలకు అమర్చాలని పోలీసులు స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్ల పై డిజైన్లు మార్చడం, అంకెలు తీసివేయడం, తాత్కాలిక స్టిక్కర్లు వేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఎవరైనా సరే నకిలీ లేదా టాంపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్లను ఉపయోగిస్తే జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.
క్రిమినల్ కేసులతో పాటు వాహనాల సీజ్
నిబంధనలు ఉల్లంఘించే వారి పైన క్రిమినల్ కేసులతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు అందరూ తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని, నిబంధనల మేరకే నెంబర్ ప్లేట్లు ఉండాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications